సూపర్ స్టార్ జీ ఈ ఫేక్ ప్రచారం అవసరమా?
కానీ ఇప్పుడు మాత్రం ఇలా సూపర్ స్టార్ సినిమాకు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఏకంగా నేషనల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి.;
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు రెండు నెలలు కష్టపడి ఆమీర్ ఖాన్ ప్రమోషన్స్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ఆమీర్ ఖాన్ చేసిన ప్రమోషన్ పెద్దగా ఫలితం ఇవ్వలేదు అనిపిస్తుంది. సూపర్ స్టార్ సినిమా అయినప్పటికీ మొదటి రోజు రాబట్టిన వసూళ్లు తీవ్రంగా నిరాశ పరిచాయి. తెలుగులో టైర్ 2 హీరోలు సైతం మొదటి రోజు తమ సినిమాలతో పాతిక కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్ తన సితారే జమీన్ పర్ సినిమాతో కేవలం పది కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. ఇది మరీ దారుణమైన ఓపెనింగ్స్ అంటున్నారు.
మొదటి రోజు వచ్చిన వసూళ్ల లెక్కలు కళ్ళ ముందు ఉండగానే రెండో రోజు, మూడో రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలకు సైతం థియేట్రికల్ రిలీజ్‌లో మినిమం వసూళ్లు రావడం లేదు. దాంతో ఈ సినిమాకు కూడా అదే పరిస్థితి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.58.5 కోట్ల వసూళ్లు రాబట్టింది అంటూ పీఆర్ టీం ప్రకటించింది. ఆమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి ఫేక్ ప్రచారం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు చిన్న హీరోల సినిమాలకు, పెద్దగా క్రేజ్ లేని సినిమాలకు మాత్రమే ఇలాంటి ప్రచారం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా సూపర్ స్టార్ సినిమాకు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఏకంగా నేషనల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమా కలెక్షన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. అయినా కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను నిలబెట్టేందుకు మేకర్స్ ముఖ్యంగా పీఆర్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న సినిమాలకు చేసిన విధంగా ప్రచారం చేస్తున్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమీర్ ఖాన్ ఈ సినిమా పబ్లిసిటీ చేయడం జరిగింది. అడిగిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. తానే స్వయంగా ఈ సినిమాను నిర్మించిన కారణంగా చాలా కష్టపడి ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అయ్యాడు. కానీ కాలం కలిసి రాలేదు. ఆమీర్ ఖాన్ దశాబ్ద కాలంగా సినిమాల్లో హిట్ అనేది దక్కించుకోలేక పోయాడు. ఈ సినిమాతో మరోసారి ఆయనకు నిరాశే మిగిలింది. తన తదుపరి సినిమాను సౌత్ దర్శకుడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాతో అయినా వరుస ఫ్లాప్స్‌కి బ్రేక్ పడుతుందా అనేది చూడాలి.