ఇండస్ట్రీలో విషాదం.. కియారా అద్వానీ మామగారు మృతి!

ఇంతలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ మామగారు, ప్రముఖ హీరో తండ్రి తుదిశ్వాస విడవడంతో అటు బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా విషాదఛాయలు అలుమకున్నాయి.;

Update: 2026-02-18 05:33 GMT

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.. మొన్నటికి మొన్న ప్రముఖ ఒడియా సింగర్ గీతా పట్నాయక్ మరణాన్ని మరువకముందే.. నిన్నటికి నిన్న ప్రముఖ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ హాస్పిటల్ పాలవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంతలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ మామగారు, ప్రముఖ హీరో తండ్రి తుదిశ్వాస విడవడంతో అటు బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా విషాదఛాయలు అలుమకున్నాయి.

ఆయన ఎవరో కాదు ప్రముఖ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ మామగారు.. అనగా సిద్ధార్థ మల్హోత్రా తండ్రి. తమ అభిమానం హీరోకి పితృవియోగం కలగడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్ర పితృ వియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. అటు కియారా అద్వానీ కూడా తన మామగారు పరమపదించడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా కియారా మామగారు అలియాస్ సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఫిబ్రవరి 14న నిద్రలోనే తుది శ్వాస విడిచారు. అయితే ఈ విషాద వార్తను సిద్ధార్త్ మల్హోత్రా చాలా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంటూ తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా తన తండ్రి గురించి ఇలా రాసుకొచ్చారు. "ఆయన క్రమశిక్షణ, నిజాయితీ, విలువలకు మారుపేరు.. కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే పక్షవాతం కారణంగా ఆయన వీల్ చైర్ కే పరిమితమైనా.. ఎప్పుడు కూడా తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. చివరికి ఏ బాధ లేకుండా నిద్రలోనే ఆయన శాశ్వతంగా కన్నుమూశారు" అంటూ తెలిపారు. ఇక తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహమే అంటూ సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీలో కెప్టెన్ గా పనిచేశారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఇటు బాలీవుడ్ ప్రముఖులు , అభిమానులు సిద్ధార్థ్, కియారా అద్వానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను పంచుకుంటూ పెట్టిన పోస్ట్ , షేర్ చేసిన ఫోటోలు అభిమానుల చేత కన్నీరు పెట్టిస్తోంది.

కియారా అద్వానీ విషయానికి వస్తే.. తెలుగులో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మళ్లీ కొన్నేళ్ల తర్వాత అదే రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేసింది. ఇది కూడా డిజాస్టర్ గానే నిలిచింది.. ఇక ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూడకుండా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు సిద్ధార్థ్ మల్హోత్రా చిత్రాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ తో కలిసి రొమాంటిక్ డ్రామా పరంసుందరి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. దర్శకుడు రాజ్ కుమార్ సంతోషితో ఒక ప్రాజెక్టులో పని చేస్తున్నారు. అలాగే జానపద థ్రిల్లర్ వన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

Tags:    

Similar News