ఒత్తిడిని అధిగ‌మించ‌డానికి న‌టిలో దైవ‌చింత‌న‌!

అందాల క‌థానాయిక‌ శ్రుతి హాసన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.;

Update: 2026-05-04 17:30 GMT

అందాల క‌థానాయిక‌ శ్రుతి హాసన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను నాస్తికురాలిని అనే ప్రచారానికి స్వస్తి పలుకుతూ.. తనలో దైవచింతన పెరగడానికి గల కారణాలను వివరించారు. మైలాపూర్ లోని వారాహి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన తర్వాతే తనలో ఈ మార్పు మొదలైందని, ఆ సమయంలో కలిగిన భక్తి పారవశ్యం తన జీవితాన్ని మార్చివేసిందని తెలిపారు. ``మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటారు`` అని పేర్కొన్న శ్రుతి వారాహి అమ్మ‌వారి గర్భగుడిలో అడుగుపెట్టినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని తెలిపారు.

శ్రుతి హాసన్ కేవలం వారాహి అమ్మవారే కాకుండా, అస్సాంలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కామాఖ్య‌ అమ్మవారిని కూడా తరచుగా సందర్శిస్తుంటానని వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలో .. కెరీర్ పరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సమయాల్లో ఈ ఆధ్యాత్మికత తనకు ఎంతో అండగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. తనలోని మానసిక ప్రశాంతతకు, నిలకడకు అమ్మవారి అనుగ్రహమే కారణమని.. దేవాలయ సందర్శన తర్వాతే తన వృత్తిపరమైన జీవితంలో కూడా సానుకూల మార్పులు వచ్చాయని శ్రుతి బలంగా విశ్వసిస్తున్నారు.

శ్రుతి తండ్రి, లోకనాయకుడు కమల్ హాసన్ విషయానికి వస్తే ఆయన దృక్పథం పూర్తిగా భిన్నం. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా కమల్ హాసన్ హేతువాదిగా, నాస్తికుడిగా గుర్తింపు పొందారు. శాస్త్రీయ ఆలోచనా దృక్పథం, సామాజిక అంశాలపై అవగాహన ఆయనను దైవభక్తికి దూరంగా ఉంచాయి. అయితే నాస్తికుడైనా కానీ.. తన సినిమాల్లో దైవత్వానికి సంబంధించిన అంశాలను ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా `దశావతారం` వంటి చిత్రాల్లో దేవుడి ఉనికిని, విష్ణుతత్వాన్ని హైలైట్ చేయడం ఆయనలోని కళాత్మక హుందాతనానికి, సృజనాత్మకతకు నిదర్శనం.

తండ్రి నాస్తికుడైనా శ్రుతి హాసన్ తనకంటూ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. ఆధునిక భావాలు కలిగిన నేటి తరం నటిగా ఈ యువ‌న‌టి తన మూలాలను- దైవచింతనను గౌరవిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒడిదుడుకులు, వ్యక్తిగత సంఘర్షణల సమయంలో ఆధ్యాత్మికత ఆమెకు ఒక ఊరటనిచ్చింది. కమల్ హాసన్ కుమార్తెగా సినిమా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నా.. విశ్వాసాల విషయంలో మాత్రం తన సొంత వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో శ్రుతి హాసన్ మాదిరిగానే దైవచింతనలో మేటి అనిపించుకున్న కథానాయికలు చాలామంది ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార తరచుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే సీనియర్ నటి స్నేహ, అనుష్క శెట్టి, సమంత కూడా ఆధ్యాత్మికతకు - యోగాకు ప్రాధాన్యతనిస్తారు. కీర్తి సురేష్ - సాయి పల్లవి వంటి తారలు కూడా తమ విజయాలకు దైవకృప తోడైందని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు.

Tags:    

Similar News