పాట‌తో అడ్డంగా బుకైనా శ్రుతిహాస‌న్!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ దుల్కర్ తనను సోంబీ అని పిలుస్తూ ఎలా ఆటపట్టించేవాడో గుర్తు చేసుకుంది.;

Update: 2026-03-26 10:30 GMT

శ్రుతి హాసన్- మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మధ్య ఉన్న స్నేహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వీరిద్దరూ చిన్నప్పుడు చెన్నైలోని ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ తన స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ దుల్కర్ తనను సోంబీ అని పిలుస్తూ ఎలా ఆటపట్టించేవాడో గుర్తు చేసుకుంది. శ్రుతి హాసన్ కు చిన్నప్పటి నుండి సంగీతంపై అమితమైన ఆసక్తి. దీంతో స్కూల్ రోజుల్లో ఒకసారి స్టేజ్ మీద ఆమె `సొంబీ` ఒక పాపులర్ సాంగ్‌ను పాడారు. ఆ పాట పాడే క్రమంలో ఆమె పలికించిన హావభావాలు, ఆ గొంతులో ఉన్న తీవ్రత చూసి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు.

అప్పటి నుండి దుల్కర్ సల్మాన్ ఆమెను ఆటపట్టించడానికి `సోంబీ` అనే నిక్ నేమ్ పెట్టేశాడట. `నేను ఆ పాటను ఎంతో ఇష్టపడి పాడాను. కానీ దుల్కర్ మాత్రం నన్ను చూసి నువ్వు నిజంగానే సోంబీలా ఉన్నావు అంటూ ఏడిపించేవాడు. స్కూల్ కారిడార్లలో నన్ను చూసినప్పుడల్లా `సోంబీ.. సోంబీ` అని పిలిచేవాడు. అలా ఆ ఒక్క పాటతో నేను మా స్కూల్ బ్యాచ్ మొత్తానికి సోంబీగా బుక్ అయిపోయాను` అని శ్రుతి నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఒక స్టార్ కిడ్ అయి ఉండి కూడా తన పాత జ్ఞాపకాలను ఇంత ఓపెన్‌గా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

దుల్కర్ సల్మాన్ కూడా ప‌లు సంద‌ర్భాల్లో శ్రుతి హాసన్ గురించి ప్రస్తావిస్తూ ` ఆమె చిన్నప్పటి నుండి చాలా టాలెంటెడ్ అని ఏదైనా పనిని చాలా పట్టుదలగా చేసేదని కొనియాడారు. కేవలం ఆటపట్టించడమే కాకుండా వారిద్దరూ కలిసి స్కూల్ ప్రాజెక్టులలో కూడా పాలుపంచుకునేవారట. ఇప్పుడు ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగి, వేర్వేరు భాషల్లో రాణిస్తుండటం విశేషం. అయితే దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వంలో `ఆకాశంలో ఒక‌తార` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. సాత్విక వీర‌వ‌ల్లి అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఇదే చిత్రంలో శ్రుతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఇంత వ‌ర‌కూ శ్రుతిహాస‌న్-ద‌ల్క‌ర్ స‌ల్మాన్ ఏ సినిమాలోనూ క‌లిసి న‌టించ‌లేదు. ఆ ర‌కంగా `ఆకాశంలో ఒక‌తార` ఇద్ద‌రికీ తొలి సినిమా అవుతుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ మ్యూజిక్ కంటే న‌ట‌న‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చి ప‌ని చేస్తోంది. అయితే మునుప‌టిలా న‌టిగా అవ‌కాశాలు అందుకోలేక‌పోతుంది. కొత్త భామ‌లు రావ‌డం..వారు స‌క్స‌స్ అవ్వ‌డంతో రేసులో బాగా వెనుక‌బ‌డుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో `స‌లార్ 2` ఒక్క‌టే క‌మిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. అలాగే రిలీజ్ అవ్వ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌డుతుంది. మ‌రి ఈలోగా మ‌రో తెలుగు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News