చాగంటి, గరికపాటి మాటలను గుర్తుచేస్తూ శివాజీ మరో వివరణ!

దండోరా సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పై చెలరేగిన వివాదం గురించి నటుడు శివాజీ మరోసారి స్పందించారు.;

Update: 2025-12-24 11:23 GMT

దండోరా సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పై చెలరేగిన వివాదం గురించి నటుడు శివాజీ మరోసారి స్పందించారు. ఆ రోజు తాను అలా మాట్లాడటానికి గల బలమైన కారణాలను వివరిస్తూ, తన ఉద్దేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని ఆయన చెప్పుకొచ్చారు.

తనకంటే ముందు ఎంతోమంది గొప్ప గొప్ప జర్నలిస్టులు, ఉదాహరణకు గంగాధర శాస్త్రి లాంటి వారు ఈ విషయాలపై మాట్లాడారని శివాజీ గుర్తుచేశారు. తెలుగు జాతి మొత్తం ఎంతో శ్రద్ధగా వినే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలను ఆయన ప్రస్తావించారు. వారు ఎప్పుడూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేశారని, ముఖ్యంగా స్త్రీకి మన సమాజంలో ఉన్న ప్రాముఖ్యత గురించి, స్త్రీ పట్ల ఉండాల్సిన గౌరవం గురించి వారు చాలా సందర్భాల్లో మాట్లాడారని శివాజీ తెలిపారు.

మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వారిని ఉద్దేశించి కూడా పెద్దలు ఎన్నోసార్లు హెచ్చరించారని ఆయన అన్నారు. సినిమాల్లో ఎలా ఉన్నా దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి పరిధులు దాటలేరు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం మన కట్టుబొట్టు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించేవారని గుర్తుచేశారు.

బయట సమాజంలో మన వస్త్రధారణ సరిగా లేకపోతే ఇబ్బందులకు గురవుతారు అనే విషయాన్ని సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్న ఎంతోమంది పెద్దలు తరతరాలుగా చెబుతూనే వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తాను ఆ రోజు అలా ఆవేదనగా మాట్లాడటానికి ప్రధాన కారణం లులు మాల్ లో జరిగిన సంఘటనే అని శివాజీ స్పష్టం చేశారు.

అక్కడ హీరోయిన్ నిధి అగర్వాల్ పడ్డ వేదన తనను బాగా కలచివేసిందన్నారు. ఆ రద్దీలో ఆమె ఇబ్బంది పడి, కారులోకి వచ్చిన తర్వాత ఎంత ఎంబరాసింగ్ గా ఫీల్ అయ్యారో చూసి తాను తట్టుకోలేకపోయానని చెప్పారు. ఆ దృశ్యం వారం రోజులైనా తన మనసులో నుంచి పోలేదని, ఆ తర్వాత వెంటనే సమంత విషయంలో జరిగిన ఘటన కూడా తనను బాధించిందని, అందుకే ఆ ఆవేదనలో ఆ మాటలు వచ్చాయని శివాజీ క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News