ఇండియా టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ వీరే.. ప్రథమ స్థానంలో ఎవరు ? ఎన్ని వందల కోట్లంటే?
భారతదేశంలో యూట్యూబ్ అనేది కేవలం ఒక వీడియో ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు, అదొక భారీ ఆదాయ వనరుగా మారిపోయింది.;
భారతదేశంలో యూట్యూబ్ అనేది కేవలం ఒక వీడియో ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు, అదొక భారీ ఆదాయ వనరుగా మారిపోయింది. మన దేశంలోని టాప్ యూట్యూబర్లు నెలకు సంపాదించే ఆదాయం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే, కోట్లాది మంది ఫాలోవర్లతో, వందల కోట్ల ఆస్తులను సంపాదించిన ఈ డిజిటల్ స్టార్ల ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. టెక్నాలజీ నుంచి కామెడీ వరకు, వంటల నుంచి మోటివేషన్ వరకు ఈ పది మంది యూట్యూబర్లు ఇండియాలోనే అత్యంత ధనవంతులుగా ఎలా ఎదిగారో ఇప్పుడు చూద్దాం.
టెక్ కింగ్‌గా గౌరవ్.. వందల కోట్ల సామ్రాజ్యం!:
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన యూట్యూబర్‌గా 'టెక్నికల్ గురూజీ' ఫేమ్ గౌరవ్ చౌదరి అగ్రస్థానంలో నిలిచారు. సుమారు ₹356 కోట్ల నికర ఆస్తులతో ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. దుబాయ్‌లో నివసిస్తూ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి వివరిస్తూ ఆయన సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక రెండో స్థానంలో 'బీబీ కీ వైన్స్' భువన్ బామ్ ఉన్నారు. మధ్యతరగతి కుర్రాడిగా యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టి, నేడు రూ.122 కోట్ల ఆస్తులతో ఒక బ్రాండ్‌గా మారిపోయారు. కేవలం కామెడీ మాత్రమే కాదు, వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో భువన్ తన ఆదాయాన్ని విపరీతంగా పెంచుకున్నారు.
వినోదం నుంచి వంటల వరకు.. కోట్లలో ఆదాయం:
కామెడీ కంటెంట్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే అమిత్ భడానా రూ.80 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, 'బీర్ బైసెప్స్' రణవీర్ అల్లాబాడియా ₹60 కోట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా యువతకు పాడ్‌కాస్ట్‌ల ద్వారా చేరువైన రణవీర్ సంపాదనలో దూసుకుపోతున్నారు. ఇక ఇండియాస్ మోస్ట్ పాపులర్ రోస్టర్ క్యారీమినాటి (అజయ్ నగర్) రూ.50 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో ఉన్నారు. వీరితో పాటు వంటల రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిషా మధులిక రూ.43 కోట్లతో ఆరో స్థానంలో నిలిచి మహిళా శక్తిని చాటారు. సాధారణ గృహిణి స్థాయి నుంచి ఇంతటి సంపదను సృష్టించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
మోటివేషన్ నుంచి ఫిట్‌నెస్ వరకు.. టాప్ 10 లిస్ట్ ఇదే:
యూత్ ఐకాన్, మోటివేషనల్ స్పీకర్ సందీప్ మహేశ్వరి దాదాపు రూ. 41 కోట్ల ఆస్తులతో తన హవా కొనసాగిస్తున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే, ఆయన తన ఛానెల్‌లో యాడ్స్ లేకుండానే ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. అదే స్థాయిలో ఆశిష్ చంచ్లానీ కూడా రూ. 41 కోట్లతో పోటీ పడుతున్నారు. ఇక విద్యావేత్తగా పేరొందిన ఫైజల్ ఖాన్ (ఖాన్ సార్) ₹40 కోట్లతో తొమ్మిదో స్థానంలో, పైలట్ కమ్ ఫిట్‌నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గౌరవ్ తనేజా, ఫ్లయింగ్ బీస్ట్ ₹39 కోట్లతో పదో స్థానంలో నిలిచారు. ఒకప్పుడు కేవలం హాబీగా మొదలైన యూట్యూబ్ ప్రయాణం, నేడు వీరిని వందల కోట్ల అధిపతులను చేసిందంటే అది వారి కష్టానికి దక్కిన ఫలితమే!