వరుస ఫ్లాపులతో కూడా స్టార్ హీరోలతోనే.. పూరీ ప్లానేంటి?
సినీ ఇండస్ట్రీలో ఫ్లాపులు కొత్త విషయం కాదు కానీ వరుసగా దారుణమైన డిజాస్టర్స్ వచ్చిన తర్వాత కూడా అదే స్పీడ్‌తో ముందుకు దూసుకెళ్తున్న డైరెక్టర్లు చాలా రేర్ గా ఉంటారు.;
సినీ ఇండస్ట్రీలో ఫ్లాపులు కొత్త విషయం కాదు కానీ వరుసగా దారుణమైన డిజాస్టర్స్ వచ్చిన తర్వాత కూడా అదే స్పీడ్‌తో ముందుకు దూసుకెళ్తున్న డైరెక్టర్లు చాలా రేర్ గా ఉంటారు. ఆ లిస్టులో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు పూరీ నుంచి సినిమా వస్తుందంటే దానిపై ఎన్నో అంచనాలుండేవి. కానీ ఇప్పుడా ఆసక్తి లేదు. దానికి కారణం ఆయన ఈ మధ్య ఫామ్ లో లేకపోవడమే.
లైగర్, డబుల్ ఇస్మార్ట్‌లతో వరుస డిజాస్టర్లు
పూరీ ఆఖరిగా హిట్ అందుకున్న సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో చేశారు కానీ ఆ రెండు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి ఆశించిన ఫలితాన్నివ్వకపోతే, రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. మామూలుగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి భారీ డిజాస్టర్ల తర్వాత ఎలాంటి డైరెక్టర్‌కు అయినా మార్కెట్ పూర్తిగా దెబ్బతింటుంది. కానీ పూరీ విషయంలో మాత్రం కథ వేరేలా ఉంది. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీతో సినిమా చేయడానికి అసలు ఏ హీరో అయినా సాహసం చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో పూరీ వెళ్లి, విజయ్ సేతుపతితో సినిమాను ఓకే చేయించుకుని, ప్రాజెక్టును అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు.
సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్న పూరీ
కంటెంట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి పూరీ అసలు ఎలాంటి కథను చెప్పి ఒప్పించారా అని అంతా అనుకున్నారు. సేతుపతితో సినిమా ఓకే చేయించుకోవడమే కాకుండా ఆ కథ పట్ల విజయ్ సేతుపతి చాలా ఆసక్తిగా ఉన్నట్టు పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. ప్రస్తుతం సేతుపతితో స్లమ్ డాగ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు తర్వాతి ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారని తెలుస్తోంది.
సూర్య తో పూరీ మూవీ?
అందులో భాగంగానే పూరీ ఇద్దరు స్టార్ హీరోలకు కథలు వినిపించారని, ఆ రెండు ప్రాజెక్టులూ దాదాపు ఫైనల్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అందులో ఒక కథ కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వినిపించారని, సూర్య కూడా పూరీ చెప్పిన కథపై ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. మరో కథ కూడా పూరీ స్టార్ హీరోకే నెరేట్ చేశారని అంటున్నారు. సేతుపతితో సినిమా రిలీజవకముందే పూరీ ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడని వస్తున్న వార్తలు విని, అసలు పూరీ స్టార్ హీరోలను ఏం చెప్పి మాయ చేస్తున్నారని భావిస్తూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.
అయితే పూరీ తో వర్కింగ్ ఎప్పుడూ రిస్కే. హై ఓల్టేజ్ క్యారెక్టర్లు, పంచ డైలాగులు, ఫాస్ట్ నెరేషన్ ఇవన్నీ ఆయన స్టైల్. పూరీ నుంచి హిట్ వస్తే ఆ సినిమా ట్రెండ్ ఎలా సెట్ చేస్తుందో, ఫ్లాప్ వచ్చినా అంతే పెద్ద స్థాయిలో ఉంటుంది. అయితే ప్రతీ ఫెయిల్యూర్ తర్వాత పూరీ మరింత అగ్రెస్సివ్ గా రీ ఎంటరవడం ఆయన స్పెషాలిటీ. ఈ నేపథ్యంలో సేతుపతితో చేస్తున్న స్లమ్ డాగ్ తో పూరీ కెరీర్లో బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనా వరుస ఫ్లాపుల తర్వాత కూడా స్టార్ హీరోలతో భారీ కాంబినేషన్లు సెట్ చేయగలగడమంటే మామూలు విషయం కాదు.