కీరవాణి ఇంట విషాదం

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత శివ శక్తి దత్తా తుది శ్వాస విడిచారు.;

Update: 2025-07-08 05:10 GMT

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత శివ శక్తి దత్తా తుది శ్వాస విడిచారు. సోమవారం రాత్రి సమయంలో శివ శక్తి దత్తా మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తండ్రి ఈ శివ శక్తి దత్తా అనే విషయం తెల్సిందే. రచయితగా ఎన్నో సినిమాలకు శివ శక్తి దత్తా పని చేశారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు శివ శక్తి దత్తా తన రచన సహకారం అందించారు. బాహుబలి సినిమా కోసం మమతల తల్లి, సాహోరే బాహుబలి పాటలను శివ శక్తి దత్తా రాశారు. ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలోని థీమ్‌ సాంగ్‌కి సైతం శివ శక్తి దత్తా సాహిత్యం అందించారు.

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు స్వయానా అన్న అయిన శివ శక్తి దత్తా ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా సేవలు అందించారు. కొన్ని వారాల ముందు వరకు కూడా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ యాక్టివ్‌గా కనిపించారు. ఆయన ఇంటర్వ్యూలు ఎన్నో యూట్యూబ్‌లో ఉంటాయి. విజయేంద్ర ప్రసాద్‌, రాజమౌళి, కీరవాణి, వల్లి, రమా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో వారి ఫ్యామిలీకి ఉన్న స్థాయి, క్రేజ్ నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూలకు భారీ డిమాండ్ ఉండేది, ఆయన ఇంటర్వ్యూల్లో ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉండేవారు.

1932లో రాజమహేంద్రవరం పక్కన ఉండే కొవ్వూరులో జన్మించిన శివ శక్తి దత్తా అసలు పేరు కోడూరు సుబ్బరాజు. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి కలిగి ఉన్న ఈయన ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోయి ముంబైలోని ఆర్ట్స్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కొవ్వూరు తిరిగి వచ్చిన ఈయన చిత్రకారుడిగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత సంగీతంపై ఆసక్తితో గిటార్‌, సితార్‌, హార్మోణియం నేర్చుకున్నారు. మద్రాస్‌లో సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినిమాల కోసం ప్రయత్నాలు చేశాడు. వీరిద్దరు కలిసి 'జానకి రాముడు' సినిమాకి వర్క్‌ చేశారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ట్రీలో వీరిద్దరికి మంచి గుర్తింపు లభించింది.

శివ శక్తి దత్తాకు ముగ్గురు సంతానం. కీరవాణి, కళ్యాణి మాలిక్‌, శివ శ్రీ కంచి. ముగ్గురిలో కీరవాణి, కళ్యాణి మాలిక్ సంగీత దర్శకులగా పరిచయం అయ్యారు. శివ శక్తి దత్తా యొక్క తమ్ముడి కొడుకు రాజమౌళి. ఇండస్ట్రీలో శివ శక్తి దత్తా ఫ్యామిలీకి చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. దర్శకులుగా, నటులుగా, సంగీత దర్శకులుగా, సింగర్స్‌గా కొనసాగుతున్నారు. శివ శక్తి మరణంతో ఆ ఫ్యామిలీ మొత్తం తీవ్ర దుఃఖంలో ఉంది. ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు శివ శక్తి దత్తాకు నివాళ్లు అర్పించారు. కీరవాణి, రాజమౌళి అభిమానులతో పాటు, తెలుగు సినిమా ప్రేమికులు శివ శక్తి దత్తాకు సోషల్‌ మీడియా ద్వారా నివాళ్లు అర్పిస్తున్నారు.

Tags:    

Similar News