ప్రాణ‌మిచ్చేయ‌డ‌మే కాదు దూరం పెట్ట‌డంలోను మాస్ రాజా!

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `ఇరుముడి`. `నిన్ను కోరి`, `మజిలీ`, `ఖుషి` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Update: 2026-08-21 03:40 GMT

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ `ఇరుముడి`. `నిన్ను కోరి`, `మజిలీ`, `ఖుషి` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా రవితేజతో ఉన్న అనుబంధం.. ఆయన వ్యక్తిత్వం గురించి శివ నిర్వాణ షేర్ చేసిన‌ ఆసక్తికర విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తనకు నచ్చిన వారికి.. తనతో సరిగ్గా సింక్ అయిన వ్యక్తులకు రవితేజ ప్రాణం ఇస్తారని.. అదే సమయంలో నచ్చకపోతే అంతే తెలివిగా దూరం పెడతారని శివ నిర్వాణ వ్యాఖ్యానించారు.

రవితేజ త‌నవారికి ఇచ్చే ప్రాధాన్యత గురించి శివ నిర్వాణ ఒక ఇంటర్వ్యూలో సరదా సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూ సమయానికి తాను సరైన షర్ట్ తెచ్చుకోకపోతే రవితేజ ఏమాత్రం సంకోచించకుండా తన షర్ట్‌నే ఇచ్చారని చెప్పారు. ``అది కొంచెం లూజ్‌గా ఉండటం వల్ల నాకు సరిపోయింది. కాస్ట్యూమర్‌కి చెప్పి నాకు షర్ట్ ఇప్పించారు. మనిషి నచ్చితే ఆయన ఇచ్చే ప్రాధాన్యత వేరేలా ఉంటుంది... ఎవరినీ ఇబ్బంది పెట్టరు.. తాను ఇబ్బంది పడరు`` అని రవితేజ మనస్తత్వాన్ని శివ నిర్వాణ వివరించారు.

ఈ సందర్భంగా `ఇరుముడి` సినిమా విశేషాలను కూడా దర్శకుడు వెల్ల‌డించారు. మానవ సంబంధాలు, భావోద్వేగాల కలబోతగా ఈ కథ సాగుతుందని చెప్పారు. అయ్యప్ప స్వామి దీక్షా నేపథ్యం సినిమాకు ఒక ముఖ్యమైన పొర లాంటిదని.. అయితే ఇది కేవలం భక్తికి మాత్రమే పరిమితమైన చిత్రం కాదని తెలిపారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బలమైన అనుబంధం... వారి జీవితాల్లో వచ్చే మార్పులే ఈ కథకు అసలైన ఆత్మ అని శివ నిర్వాణ స్పష్టం చేశారు. రవితేజలోని ఊరమాస్ ఎనర్జీని చూపిస్తూనే... ఇప్పటివరకు ఎవరూ చూడని కొత్త తరహా భావోద్వేగమైన నటనను ఈ సినిమాలో ప్రదర్శించారని కొనియాడారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ (కావేరి పాత్రలో) నటిస్తుండగా... రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర ..సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని.. ప్రతి బంధాన్ని చాలా ఆర్గానిక్‌గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ కథపై నమ్మకంతో నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ల సహకారం మరువలేనిదని... జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమా ఎమోషనల్ గ్రాఫ్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లిందని తెలిపారు.

విష్ణు శర్మ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సాహి సురేష్ ఆర్ట్ డిజైన్‌తో సాంకేతికంగానూ ఈ చిత్రం ఎంతో ఉన్నతంగా రూపుదిద్దుకుందని దర్శకుడు పేర్కొన్నారు. ఫ్యామిలీ, సెంటిమెంట్, ఆధ్యాత్మికత, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకులు కోరుకునే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను `ఇరుముడి` అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News