అదంతా అభిమానుల ప్రచారమే.. చిరంజీవి-డాన్ లీ ఎంట్రీపై 'స్పిరిట్' నిర్మాత క్లారిటీ
సినిమా ప్రమోషన్ల నుండి పాత్రల ఎంపిక వరకు వంగా సోదరులు అనుసరిస్తున్న ప్రత్యేకమైన శైలి ఈ చిత్రంపై మరింత కుతూహలాన్ని పెంచుతోంది.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ `స్పిరిట్` చుట్టూ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాలు సహా సోషల్ మీడియాలోనూ విపరీతమైన చర్చ నడుస్తోంది. పాన్-ఇండియా స్థాయి దాటి గ్లోబల్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కాస్టింగ్- పిఆర్ స్ట్రాటజీ- స్టోరీ టెల్లింగ్ గురించి నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు టాలీవుడ్ రొటీన్ మేకింగ్ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయి. సినిమా ప్రమోషన్ల నుండి పాత్రల ఎంపిక వరకు వంగా సోదరులు అనుసరిస్తున్న ప్రత్యేకమైన శైలి ఈ చిత్రంపై మరింత కుతూహలాన్ని పెంచుతోంది.
సాధారణంగా నేటితరం బిగ్-బడ్జెట్ సినిమాలకు మోషన్ పోస్టర్ మొదలుకొని చిన్న అప్‌డేట్ వరకు పబ్లిసిటీ కోసం రూ.లక్షల్లో వెచ్చించే పిఆర్ లపై ఆధారపడటం పరిపాటిగా మారింది. అయితే ``మాకు ఎటువంటి పర్సనల్ లేదా పెయిడ్ పిఆర్ సిస్టమ్ లేదు`` అని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం. రూమర్లు, లీకుల ద్వారా వచ్చే ఆర్గానిక్ బజ్ మాత్రమే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తుందని... డబ్బులు వెచ్చించి కృత్రిమంగా వార్తలను సృష్టించే సంస్కృతికి తాము దూరంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం పరిశ్రమలోని మిగతా నిర్మాతలకు ఒక భిన్నమైన ఆలోచనా దృక్పథాన్ని అందిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి లేదా ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు `స్పిరిట్`లో భాగం కాబోతున్నారంటూ వైరలైన వార్తలకు ప్రణయ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చిన్నప్పటి నుండి చిరంజీవి గారికి తాము భయంకరమైన అభిమానులమని, `ఖైదీ` సినిమానే తమకు మొదటి సినిమా జ్ఞాపకమని చెబుతూనే.. సినిమాలో లేని పాత్రల గురించి వచ్చే పుకార్లను కొట్టిపారేశారు. ప్రకాష్ రాజ్ కాంబినేషన్ తొలత అనుకున్నా.. కథా గమనంలో అది వర్కవుట్ కాకపోవడంతో ఆయన స్థానాన్ని మార్చాల్సి వచ్చిందని వెల్లడించడం ద్వారా పాత్రల ప్రాధాన్యతకే తాము పెద్ద పీట వేస్తామని చెప్పకనే చెప్పారు.
హాలీవుడ్- కొరియన్ యాక్షన్ స్టార్ `డాన్ లీ` ఈ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలపై స్పందిస్తూ.. అభిమానుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నా.. అంతర్జాతీయ నటులను కేవలం మార్కెట్ క్రేజ్ కోసం తేవడం తమకు ఇష్టం లేదన్నారు. `స్పిరిట్` అనేది హైదరాబాద్ - భారతీయ మూలాలున్న కథ కావడం వల్ల.. కథా నేపథ్యానికి న్యాయం చేయడమే ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. బడ్జెట్ లేదా ఎకనామిక్స్ సమస్య కాకపోయినా.. కథలోని నేటివిటీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఓవర్ ది టాప్ ప్రచారం కంటే కథలోని బలాన్ని- యూనిక్ కంటెంట్‌ను నమ్ముకోవడమే వంగా బ్రదర్స్ శైలి అని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్టార్ కాస్టింగ్ కంటే కథా పరిధికి, నాచురాలిటీకే ప్రాధాన్యమిచ్చే వారి మేకింగ్ ప్రతిభ మరోసారి `స్పిరిట్` రూపంలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. కేవలం కమర్షియల్ హంగుల కోసం కాకుండా.. కథకు అవసరమైన అంశాలనే ఎంచుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాలనే వంగా బ్రదర్స్ తపన టాలీవుడ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందనడంలో సందేహం లేదు. `స్పిరిట్` చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ వెచ్చించి టీసిరీస్ భూషణ్ కుమార్ తో కలిసి ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ట్రిప్తి దిమ్రీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.