విల్ స్మిత్ కి 'రాకా' 80 కోట్లు చెల్లించుకోవాల్సిందే!

ఇండియన్ సినిమా ఇప్పుడు దేశీయ మార్కెట్‌కే పరిమితం కావ‌డం లేదు. గ్లోబల్ స్థాయికి విస్తరిస్తోంది.

Update: 2026-08-21 00:30 GMT

ఇండియన్ సినిమా ఇప్పుడు దేశీయ మార్కెట్‌కే పరిమితం కావ‌డం లేదు. గ్లోబల్ స్థాయికి విస్తరిస్తోంది. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు, విజువల్ ఎఫెక్ట్స్ మన సినిమాలకు ప‌నిచేయ‌డంతో హాలీవుడ్ టాప్ స్టార్లను కూడా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం `రాకా` కోసం హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ని సైతం రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్రచారం ప‌తాక స్థాయిలో జ‌రుగుతోంది.

ఇందులో స్మిత్ కీలకమైన -పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా మేకర్స్ - విల్ స్మిత్ ప్రతినిధుల మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నాయని, కాస్ట్యూమ్స్ నుండి డేట్స్ వరకు అన్ని విషయాలపై గోప్యంగా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఈ గ్లోబల్ కొలాబరేషన్ కనుక నిజమైతే? ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే విల్ స్మిత్ లాంటి గ్లోబల్ బాక్సాఫీస్ స్టామినా ఉన్న నటుడిని తెలుగు సినిమాలో నటింపజేయడం అంత ఆషామాషీ విషయం కాదు. హాలీవుడ్‌లో ఆయన రేంజ్ -డిమాండ్‌ను బట్టి చూస్తే కొన్ని వారాల కోసం ఆయన భారీ మొత్తంలో డిమాండ్ చేస్తారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం `రాకా` చిత్రంలో ఆయన పాత్ర నిడివి .. ప్రాధాన్యతను బట్టి పారితోషికం కిందనే 80 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది.

హాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 20 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసే విల్ స్మిత్ ఇతర ఇండస్ట్రీల ప్రాజెక్టుల్లో గెస్ట్ రోల్స్ లేదా కీలక పాత్రలు చేయడానికి కూడా 10 నుండి 15 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తుంటారు. ఈ లెక్కన చూస్తే `రాకా` చిత్ర నిర్మాతలు ఆయనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ రూపేణా భారీ బడ్జెట్‌ను కేటాయించక తప్పదు. అడ్వాన్స్ రెమ్యునరేషన్‌తో పాటు గ్లోబల్ ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. సినిమా నిర్మాణ వ్యయం అంచనాలను మించే ఛాన్స్ ఉంది.

విల్ స్మిత్ లాంటి గ్లోబల్ స్టార్‌ను ఇండియ‌న్ సినిమాలో భాగం చేయడం ద్వారా ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా లభించే పబ్లిసిటీ -మార్కెట్ పరిధి అంచనాలకు మించి పెరుగుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ - వెస్ట్రన్ మార్కెట్లలో `రాకా` సినిమాకు తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక హీరో లేదా విలన్ పాత్ర కోసమే అంత భారీ మొత్తం చెల్లించడం సాహసమే అయినా? అట్లీ ప్లాన్ చేస్తున్న విజువల్ వండర్‌కు ఇది సరిగ్గా సరిపోతుందని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

మొత్తంగా `రాకా` చిత్రంలో విల్ స్మిత్ ఎంట్రీ ఇస్తారనే వార్త టాలీవుడ్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ఒకవేళ ఆయన గ్రీస్ సిగ్నల్ ఇచ్చి 80 కోట్ల పారితోషికంతో ప్రాజెక్ట్‌లో అడుగుపెడితే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నీ తల్లకిందులు కావడం ఖాయం. ఈ గ్లోబల్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రియులు అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News