ఏదైనా థియేటర్ నుంచే మారాలి
ముఖ్యంగా ఓటీటీల రాకతో థియేటర్ల ప్రాధాన్యత తగ్గిందనే వాదనల మీద ఆయన చాలా ప్రాక్టికల్ గా స్పందించారు.
తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల భవిష్యత్తుపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాకి అసలైన రెవెన్యూ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ప్రేక్షకులు వెండితెరను ఎందుకు ఇష్టపడతారు? అనే అంశాలపై నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల రాకతో థియేటర్ల ప్రాధాన్యత తగ్గిందనే వాదనల మీద ఆయన చాలా ప్రాక్టికల్ గా స్పందించారు.
ఇండస్ట్రీలో ఏ వ్యవస్థ మారాలన్నా అది థియేటర్ స్థాయి నుంచే మొదలవ్వాలని ఆయన బలంగా చెప్పారు. ఒక సినిమాకు అసలైన రాబడి థియేటర్ల నుంచే మొదలవుతుందని శిరీష్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఉన్న ప్రాధాన్యత పెరిగి, థియేటర్లను తక్కువ చేసి చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి సినిమాను ఆస్వాదించేది, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసేది థియేటర్ల వద్దేనని.. ఆ అనుభూతి ఇంట్లో కూర్చుని చూస్తే రాదని ఆయన స్పష్టం చేశారు.
ఓటీటీ అనేది ఒక ఆప్షన్ మాత్రమే కానీ, అది థియేటర్ కు ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ గురించి శిరీష్ రెడ్డి ఒక ఆసక్తికరమైన లాజిక్ చెప్పారు. పాత సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో అందుబాటులో ఉన్నా, ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ల వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారో ఆలోచించాలని ఆయన కోరారు. ఓటీటీలో ఉన్నా సరే థియేటర్లో ఆ సినిమాను చూస్తున్నారంటే, అది కేవలం అక్కడ దొరికే ఎంజాయ్‌మెంట్ కోసమేనని ఆయన తెలిపారు.
దీన్ని బట్టి చూస్తే థియేటర్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఎమోషన్ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీపై ఉందని తెలిపారు. సినీ పరిశ్రమలో పాలిచ్చేవాడే పాలేరు అయ్యాడు అనే రేంజ్ లో ప్రస్తుతం ఎగ్జిబిటర్ల పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయం పుట్టేది థియేటర్ దగ్గరే అయినప్పుడు, అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించకుండా మిగిలిన వాటి గురించి మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదని శిరీష్ రెడ్డి చెప్పారు.
అందుకే సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడానికి పర్సంటేజీ విధానం లాంటి మార్పులు అవసరమని ఆయన గట్టిగా వినిపించారు. వ్యవస్థ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే దానికి సరైన గుర్తింపు దక్కాలని కోరారు. ఇక శిరీష్ రెడ్డి మాటలు థియేటర్ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేశాయి. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ప్రేక్షకుడు వెండితెరపై సినిమా చూస్తూ పొందే ఆనందం వేరు. థియేటర్లను బ్రతికించుకుంటేనే సినిమా పరిశ్రమ నిలబడుతుందని ఆయన క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు. ఓటీటీలు మనకు సౌకర్యాన్ని ఇవ్వొచ్చు కానీ, థియేటర్ ఇచ్చే కిక్ మాత్రం ఎప్పటికీ ఇవ్వలేవనేది అసలు నిజం. మరి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి.