మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు..!
నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు షైన్ టామ్ చాకో.;
నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు షైన్ టామ్ చాకో. ఇతడు తెలుగులో ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోనూ నటించడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ మలయాళ నటుడు సుదీర్ఘ కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. షైన్ టామ్ చాకో సహాయ దర్శకుడిగా దాదాపు 9 ఏళ్లు దర్శకుడు కమల్ వద్ద చేశాడు. ఖద్దమా సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పలు మలయాళ సినిమాల్లో నటించడం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 2014లో ఇతిహాస అనే సినిమాలో నటించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీ యాక్టర్‌గా సినిమాలు చేస్తున్న షైన్ టామ్ చాకో చుట్టూ వివాదాలు రాజుకున్న విషయం తెల్సిందే. నటి పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతే కాకుండా డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందని నిర్ధారణ కావడంతో అతడిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలంటూ చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడి నటన ప్రతిభ నేపథ్యంలో అతడు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. ఎంతటి ప్రతిభావంతుడు అయినా ప్రవర్తన సరిగా లేకుంటే ఆయనను ఇండస్ట్రీ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించాలంటూ స్వయంగా ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
షైన్ టామ్ చాకో వ్యవహారంపై ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ వారు తీవ్రంగా స్పందించారు. గతంలోనూ వేదింపుల ఫిర్యాదులను షైన్ టామ్ చాకో మీద వచ్చాయి. దాంతో ఆయన్ను చాలా మంది విమర్శించారు. ఇప్పుడు ఫెప్కా వారు సైతం తీవ్రంగా హెచ్చరించింది. మీ ప్రతిభపై గౌరవంతో, మీరు గతంలో చేసిన పాత్రలను దృష్టిలో ఉంచుకుని, ఇండస్ట్రీలో మీ అవసరం ఉందని భావించి చివరి అవకాశం ఇస్తున్నామంటూ కమిటీ సభ్యులు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఆరోపణలు వినిపిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తించిన, డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసినా సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని ఫెడరేషన్ సభ్యులు వార్నింగ్ ఇచ్చారట.
సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎదుటి వారిని గౌరవించడంతో పాటు, పని పట్ల శ్రద్ద ఉండాలి. నిర్మాతకు ఇచ్చిన డేట్లకు షూటింగ్ కు హాజరు అవ్వాలి, తీసుకున్న పారితోషికంకు న్యాయం చేయాలి. లేదంటే ఏ భాషకు చెందిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు అయినా కఠిన చర్యలు తీసుకోవడం పరిపాటి. షైన్ టామ్ చాకో విషయంలో లక్ అని చెప్పాలి. ఒక అవకాశం ఇవ్వడం ద్వారా ఆయనపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకంను నిలబెట్టుకోకుంటే ఇక పై ఆయన ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉండవు. విలన్ వేషాలు వేస్తూ పాపులారిటీని సొంతం చేసుకున్న ఇతడు నిజ జీవితంలోనూ విలన్ వేషాలు వేస్తానంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. కనుక ఇకపై అయినా జాగ్రత్తగా ఉంటాడేమో చూడాలి.