శర్వా 'సంక్రాంతి' మూవీ.. సాలిడ్ డీల్ ఫిక్స్ అయిందా?
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్.. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్.. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది. జనవరి 14వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.
అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా కామెడీతో సినిమా క్లిక్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు. ముఖ్యంగా శర్వానంద్ కు సంక్రాంతి పండుగ ఇప్పటికే రెండు సార్లు కలిసొచ్చింది. రన్ రాజా రన్, శతమానం భవతి సినిమాలు కూడా పొంగల్ కే వచ్చి మంచి హిట్స్ గా నిలిచాయి.
దీంతో ఇప్పుడు నారీ నారీ నడుమ మురారికి కూడా సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే రిలీజ్ కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను రీసెంట్ గా అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. సాలిడ్ అమౌంట్ తో డీల్స్ ఫిక్స్ చేసుకున్నారని వినికిడి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో.. శర్వానంద్ మూవీ డిజిటల్ రైట్స్ కు గాను రూ.17 కోట్లు చెల్లించిందని వినికిడి. ఆ తర్వాత శాటిలైట్ హక్కుల కోసం జీ తెలుగు రూ.3 కోట్లు చెల్లించిందని సమాచారం. ఆడియో రైట్స్ కు రూ.2.50 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.22.5 కోట్లు అందుకున్నారట.
అయితే నారీ నారీ నడుమ మురారి మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి.. సినిమా క్లిక్ అయితే మంచి లాభాలు అందుకోనున్నారు మేకర్స్. ఎందుకంటే టాక్ తో సంబంధం లేకుండా పొంగల్ సీజన్ లో వసూళ్లు వస్తాయి. అలాంటిది సినిమా హిట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు.
ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర సినిమాకు మ్యూజిక్ అందించారు. శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.
వీరితో పాటు సత్య, వెన్నెల కిశోర్, నరేష్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఒకే ఆఫీసులో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి, తన ఎక్స్ లవర్ కు మధ్య నలిగే ఓ యువకుడు.. అదే శర్వానంద్ కథే నారీ నారీ నడుమ మురారి సినిమాగా తెలుస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.