18 ఏళ్ల బోయ్‌గా మారడానికి 40 ప్లస్ హీరో పాట్లు
ఇందులో 18 ఏళ్ల యువ బైకర్ గా నటించాలి. దానికోసం అతడు చాలా బరువు తగ్గాల్సి ఉంటుంది. మేకోవర్ కోసం అతడు ఎంతదాకా అయినా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.;
ఏదైనా సాధించాలి అంటే పట్టుదల కావాలి. దానికి తోడు కఠినమైన శ్రమ, ప్రణాళిక చాలా కీలకం. అయితే వీటన్నిటికీ ప్రేరణ అనేది ముఖ్యం. తాను ఎంచుకున్న ఒక సినిమా అలాంటి ప్రేరణనిచ్చింది కాబట్టే ఏకంగా 22 కేజీల బరువు తగ్గానని చెప్పాడు యవహీరో శర్వానంద్(41). దాదాపు రెండేళ్ల క్రితం ఒక అరుదైన స్క్రిప్టు శర్వాను వెతుక్కుంటూ వచ్చింది. ఇందులో 18 ఏళ్ల యువ బైకర్ గా నటించాలి. దానికోసం అతడు చాలా బరువు తగ్గాల్సి ఉంటుంది. మేకోవర్ కోసం అతడు ఎంతదాకా అయినా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అప్పటికి తన ఏజ్ 39. బరువు 92 కేజీలు. ఆ తర్వాత వెయిట్ లాస్ జర్నీ ప్రారంభమైంది. రెండేళ్లలో ఏకంగా 22 కేజీలు తగ్గాడు. అంటే సుమారు 70కేజీలకు బరువు తగ్గాడు. ఈ ప్రయాణం కోసం తెల్లవారుఝామున 4.30కు నిద్ర లేచేవాడు. ఆ సమయంలో కేబీఆర్ పార్క్ లో జాగింగ్, ఆ తర్వాత కఠినమైన జిమ్ సెషన్స్, సాయంత్రం వాకింగ్ వంటి కఠినమైన నియమాలను పాటించాడు. రెండేళ్ల పాటు చాలా తీవ్రంగా శ్రమించాక దాదాపు 22 కేజీలు తగ్గాడు అంటే నెలకు కేజీ చొప్పున ప్రామాణికంగా బరువు తగ్గాడు. ఇప్పుడు తాను ఎంచుకున్న పాత్రకు ఇది సరిపోతుంది.
ఒక నటుడు మేకోవర్ కోసం ఎంతగా శ్రమించాలో శర్వానంద్ ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అతడు 2019లో ఓకే జాను చిత్రీకరణ సమయంలో పెను ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బరువు అదుపు తప్పాడు. అదే పనిగా బరువు పెరిగాడు. ఏకంగా 92 కిలోలకు పెరిగాడు. దీంతో చాలా నిరాశ నిస్పృహలకు గురయ్యానని శర్వా చెప్పారు. నిజానికి శర్వానంద్ భోజన ప్రియుడు. మంచి ఆహారాన్ని శుచిగా భోంచేస్తాడు. కానీ నాలుక కట్టేసుకుని బరువు తగ్గడం కోసం కఠినంగా శ్రమించాడు. ఎంతో క్రమశిక్షణతో అనుకున్నది సాధించుకున్నానని చెప్పాడు. 18 ఏళ్ల బైకర్ గా కనిపించాలనే ఒకే ఒక్క ప్రేరణ దీని వెనక బలంగా పని చేసిందని శర్వానంద్ చెప్పారు. సినిమాతో పాటు తనకు కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తర్వాత తన బాధ్యత పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే స్పృహ కూడా పెరిగింది. కుటుంబం కోసం తాను ఇంతగా శ్రమించానని అంగీకరించాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం నారి నారి నడుమ మురారి, భోగి చిత్రాలలో నటిస్తున్నాడు. బైకర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. నారీ నారీ నడుమ మురారి వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఎంతో మనసు పెట్టి, చాలా శ్రమించాడు కాబట్టి బైకర్ అతడికి బిగ్ బ్రేక్ నిస్తుందని ఆశిద్దాం.