మురగదాస్-శంకర్ కొత్త ఏడాది కొత్త కబురా?
కోలీవుడ్ దర్శకులు శంకర్-మురగదాస్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నారో తెలిసిందే. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు.;
కోలీవుడ్ దర్శకులు శంకర్-మురగదాస్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నారో తెలిసిందే. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఇప్పుడా విమర్శలకు వీలైనంత త్వరగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. మునుపటిలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేయడానికి చేతిలో సమయం లేదు. నవతరం దర్శకుల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. గ్యాప్ తీసుకుంటే? ఆ గ్యాప్ ఎన్ని సంవత్సరాలకైనా దారి తీసే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ హీరోలంతా సక్సెస్ పుల్ దర్శకులకే డేట్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఫెయిల్యూర్ దర్శకులతో రిస్క్ తీసుకోవడానికి ముందుకు రాని సన్నివేశం కనిపిస్తుంది.
భారీ చిత్రం కోసం ప్లానింగ్:
లాంగ్ గ్యాప్ అన్నది ఇద్దర్నీ మరింత డిఫెన్స్ లోకి నెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శంకర్-మురగదాస్ ఆలోచనల్లో సైతం మార్పు మొదలైందన్నది తాజా అప్ డేట్. వచ్చే ఏడాది ఇద్దరి నుంచి కొత్త అప్ డేట్ వస్తుందని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ముందుగా శంకర్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఓ స్టార్ హీరోకి స్టోరీ వినిపించినట్లు సమాచారం. అతడు సూర్య అన్నట్లుగా వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం తేలాలి. అలాగే మురగదాస్ కూడా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ కన్నడ నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతున్నాడుట.
ఒత్తిడిలో ఆ ఇద్దరు:
హీరో ఎవరు? అన్నది ఇంకా మురగదాస్ కూడా డిసైడ్ అవ్వలేదుట.స్టోరీ మాత్రం సిద్దంగా ఉందని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమే అయితే వచ్చే ఏడాది ఇద్దరి నుంచి అప్ డేట్ రావడం లాంఛనమే. ఇద్దరు ఉన్న పళంగా హిట్ కొడితే తప్ప మార్కెట్ లో పేరు వినిపించడం కష్టం. ఆ ఇద్దరు దర్శకులతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. వాళ్ల సినిమాలను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్ల నుంచి కూడా నిర్మాతలపై ఒత్తిడి ఉండనే ఉంది. నిర్మాతలు ఆ ఒత్తిడి నుంచి బయడ పడాలన్నా? మురగదాస్, శంకర్ పూనుకుంటే తప్ప బయట పడలేరు.
సక్సెస్ మాత్రమే సమాధానం:
ఈ రకంగా దర్శకులపై కూడా పరోక్షంగా ఒత్తిడి కనిపిస్తుంది. ఇరువురు తదుపరి ఏ హీరోతో సినిమా చేసినా హిట్ కొట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. విజయం మాత్రమే ఇరువుర్ని విమర్శల నుంచి ప్రశంసల వైపు తీసుకెళ్లగలదు. శంకర్ డైరెక్ట్ చేసిన `ఇండియన్ 3` ఇప్పటికే విడుదల కావాలి. కానీ రిలీజ్ విషయంలో డైలమా కనిపిస్తుంది. ఆరేడు నెలలుగా రిలీజ్ అవుతుందనే ప్రచారం తప్ప ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమా విజయం సాధిస్తే? శంకర్ పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. మళ్లీ గత వైభవం అందుకోలగడు అన్న నమ్మకం అభిమానుల్లో నెలకొంటుంది.