జాంబీ మూవీ ఈ డెబ్యూ బ్యూటీని కాపాడుతుందా?

బాలీవుడ్ స్టార్ కిడ్ షనాయా కపూర్ సినీ రంగప్రవేశం ఆశించినంత సాఫీగా సాగలేదు.;

Update: 2026-04-25 03:45 GMT

బాలీవుడ్ స్టార్ కిడ్ షనాయా కపూర్ సినీ రంగప్రవేశం ఆశించినంత సాఫీగా సాగలేదు. తన తొలి చిత్రం విడుదల కోసం చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. తీరా విడుదలైన `ఆంఖోన్ కీ గుస్తాఖియాన్`, `తూ యా మైన్` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఒక పక్క నటిగా నిరూపించుకోవాలని తపిస్తున్నా.. విజయం మాత్రం ఊరిస్తూనే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షనాయా ఇప్పుడు టైగర్ ష్రాఫ్ సరసన ఒక వినూత్నమైన `జాంబీ కామెడీ` చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది. ఈ ప్రయోగాత్మక చిత్రం షాన‌య‌ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.




 


అయితే ఈ ప్రాజెక్టులో మరో సవాలు కూడా ఉంది. యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ కూడా ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో ఫిరోజ్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2013లో వచ్చిన `గో గోవా గాన్` తర్వాత హిందీలో ఈ జోనర్‌లో మరో భారీ చిత్రం రాలేదు. టైగర్ ష్రాఫ్ తన పంథా మార్చుకుని మొదటిసారి పూర్తిస్థాయి కామెడీ.. జాంబీ జోనర్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం. ఈ కొత్త ప్రయోగం టైగర్‌కు.. షనాయాకు లక్కును తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.




 


భారతీయ ప్రేక్షకులు ఇటీవలి కాలంలో విభిన్నమైన జోనర్లను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో వచ్చిన `జాంబీ రెడ్డి` వంటి చిత్రం హిట్ కావడంతో.. మన ఆడియన్స్‌కు జాంబీ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు. షనాయా కపూర్ తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి.. టైగర్ తన ఫ్లాపుల పరంపరను ఆపడానికి ఈ `జాంబీ కామెడీ`నే సరైన మార్గమని వారు భావిస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద జాంబీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.




 


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో జాంబీ జోనర్ అనేది చాలా పరిమితమైనది. అయినా కానీ పలువురు భారతీయ నటీమణులు ఈ ప్రయోగాత్మక చిత్రాలలో నటించి మెప్పించారు. బాలీవుడ్‌లో ఈ జోనర్‌కు పునాది వేసిన `గో గోవా గాన్` (2013) చిత్రంలో పూజా గుప్తా కీలక పాత్రలో నటించి గుర్తింపు పొందారు. టాలీవుడ్‌లో మొదటి జాంబీ చిత్రంగా వచ్చిన `జాంబీ రెడ్డి` (2021)లో ఆనంది , దక్ష నగార్కర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు జాంబీ కాన్సెప్ట్‌ను కామెడీ - యాక్షన్‌తో మిళితం చేసి కొత్త అనుభూతిని అందించింది.

తమిళ చిత్ర పరిశ్రమలో కూడా జయం రవి నటించిన `మిరుతన్` (2016) అనే పూర్తిస్థాయి జాంబీ థ్రిల్లర్‌లో లక్ష్మి మీనన్ కథానాయికగా నటించారు. మలయాళంలో వచ్చిన `ఎక్స్` వంటి చిత్రాల్లో కూడా పలువురు నటీమణులు ఈ జోనర్‌ను టచ్ చేశారు. తాజాగా షనాయా కపూర్ కూడా భారీ బడ్జెట్ జాంబీ కామెడీ చిత్రాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి విభిన్న కథాంశాలను ఎంచుకోవడం ద్వారా భారతీయ నటీమణులు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ప్రయోగాత్మక సినిమాలతో తమ నటనకు పదును పెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News