రూ.1కి భోజ‌నం.. ఈరోజు 800కోట్ల క్ల‌బ్ హీరోకి తండ్రి

అత‌డు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ యాక్ష‌న్ (స్టంట్) కొరియోగ్రాఫ‌ర్. ఒక‌ప్పుడు ఉద్యోగం స‌ద్యోగం లేక ముంబై వీధుల్లో తిరిగాడు. ఊళ్లో 3000 అప్పు తీసుకుని ముంబైకి వ‌చ్చాడు.;

Update: 2025-07-29 04:02 GMT

అత‌డు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ యాక్ష‌న్ (స్టంట్) కొరియోగ్రాఫ‌ర్. ఒక‌ప్పుడు ఉద్యోగం స‌ద్యోగం లేక ముంబై వీధుల్లో తిరిగాడు. ఊళ్లో 3000 అప్పు తీసుకుని ముంబైకి వ‌చ్చాడు. బ‌త‌క‌డానికి డ‌బ్బుల్లేని ధైన్య స్థితిలో రూ.1కే భోజ‌నంతో రోజంతా గ‌డిపేవాడు. సిగ‌రెట్ కొనేందుకు డ‌బ్బుల్లేక 10పైస‌ల బీడీ కాల్చేవాడు. ఆంగ్ల సాహిత్యంలో లిట‌రేచ‌ర్ పూర్తి చేసిన అత‌డు, లెక్చ‌ర‌ర్ కావాల‌నుకున్నా ఆర్థిక క‌ష్టాల‌తో అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయాడు. సేల్స్ మేన్ గా నెల‌కు 350 జీతానికి ప‌ని చేసాడు. ఆ త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ‌లో యాక్ష‌న్ డైరెక్ట‌ర్ల వ‌ద్ద జీతం లేకుండా ప‌నికి కుదిరాడు. కాల‌క్ర‌మంలో వేరొక‌రి పేరుతో జాయింట్ గా అత‌డి పేరు కూడా తెర‌పై క‌నిపించింది.


నిజానికి సేల్స్ మేన్ గా ప‌ని చేసేప్పుడు అత‌డి ప్ర‌యాణం అత్యంత క‌ఠిన‌మైన‌ది. ప్ర‌తిరోజూ చెంబూర్‌లోని తన ఆఫీస్‌కి చేరుకోవ‌డానికి షామ్ కౌశ‌ల్ రెండు బస్సులు మారేవాడు. రైలులో వెళ్లేవాడు. లంచ్ - డిన్న‌ర్ రెండిటికీ ఒక రూపాయి మాత్ర‌మే అత‌డి వ‌ద్ద మిగిలేది. కొన్ని పైసలు ఖ‌ర్చు చేసి మిసల్ పావ్ - బటాటా వడ తినేవాడు. ప‌ది పైస‌ల బీడీల‌తో స‌రిపెట్టుకునేవాడు. ఇంటికి అద్దె క‌ట్ట‌లేక ఆఫీస్ లో నివ‌శించాడు. బట్టలు మార్చుకోవడానికి ఘట్కోపర్‌లోని ఒక స్నేహితుడి ఇంటికి రోజూ నడిచి వెళ్ళేవాడు. అయితే ఏడాదిలోనే ఉద్యోగం పోవ‌డం కీల‌క మ‌లుపు. ఇక‌పై ఎప్ప‌టికీ ఉద్యోగం చేయ‌కూడ‌దు. ముంబై వ‌దిలి వెళ్ల‌కూడ‌దని నిర్ణ‌యించుకున్నాడు.

ఇక సినీప‌రిశ్ర‌మ‌లో స్టంట్ మ‌న్ గా ప‌ని చేసే స‌మ‌యంలోనే త‌న పంజాబీ మిత్రుల సాయంతో అసోసియేష‌న్ లో చేరాడు. 1000 స‌భ్య‌త్వ రుసుము కోసం స్నేహితులు సాయం చేసారు. ఆ త‌ర్వాత స్టంట్ మ‌న్ గా అవ‌కాశాలొచ్చాయి. అప్ప‌టికి ప్ర‌ముఖ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ వీరూ దేవ‌గ‌న్ తో ప‌రియం ఏర్ప‌డింది. షామ్ కౌశ‌ల్ ప‌నిత‌నం చూశాక వీరూ అవ‌కాశాలిచ్చారు. గురువు గారికి టీ అందించ‌డం, బ్యాగులు మోయ‌డం స‌హా స‌హాయ‌కుడిగా అన్ని ప‌నులు చేసాడు. చివ‌రికి వీరూ పోరాట స‌న్నివేశాల‌కు స‌హాయ‌కుడిగా షామ్ కౌశ‌ల్ పేరును తెర‌పై వేయించాడు. ఆ త‌ర్వాత సంపాద‌న ప్రారంభ‌మైంది. ప‌ప్పు వ‌ర్మ వ‌ద్ద స్టంట్ డైరెక్ష‌న్ కి సంబంధించిన మ‌రిన్ని మెళ‌కువ‌లు నేర్చుకున్నాడు. అయితే ఆ స‌మ‌యంలో అత‌డు ఉచితంగానే ప‌ని చేసాడు. అయినా త‌న ప‌నిని ఆప‌లేదు.

సన్నీ డియోల్ నటించిన బేతాబ్ చిత్రంతో స్టంట్ డైరెక్ట‌ర్ గా షామ్ కౌశ‌ల్ కి బిగ్ బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో త‌న‌ నటనకు రూ. 500 పేమెంట్ అందింది. నిజానికి త‌న‌కు అసిస్టెంట్ స్టంట్ మ‌న్ గా వ‌చ్చే దానికంటే చాలా రెట్లు ఎక్కువ‌. 1980ల‌లో ప్రారంభ‌మైన కెరీర్ జ‌ర్నీ 1990ల నాటికి పీక్స్ కి చేరుకుంది. అదే క్ర‌మంలో అత‌డి జీవితంలో ఒక కీల‌క మ‌లుపు. ఊహించ‌ని విధంగా షామ్ కి క్యాన్స‌ర్ వ‌చ్చింది. ల‌డ‌ఖ్ లో ల‌క్ష్య షూటింగ్ స‌మ‌యంలో క‌డుపులో భ‌రించ‌లేని నొప్పి వ‌చ్చింది. దాని కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడు. కానీ శ‌క్తి లేక‌పోవ‌డంతో అది కుద‌ర‌లేదు. చివ‌రికి క్యాన్స‌ర్ కి ర‌క‌ర‌కాల చికిత్స‌లు తీసుకున్న త‌ర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు అత‌డి కుమారుడు విక్కీ కౌశ‌ల్ సినీప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోగా ఎదిగాడు.

విక్కీ న‌టించిన యూరి, చావా లాంటి సినిమాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. చావా ఈ ఏడాది విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. ఈ చిత్రం ఏకంగా 800 కోట్లు వ‌సూలు చేసింది. రూ.1కే భోజ‌నం చేసి షాల్ (ఇంటి) అద్దె క‌ట్ట‌లేని ధైన్య స్థితి నుంచి ఇప్పుడు ఆయ‌న కుమారుల అసాధార‌ణ ఎదుగుద‌ల‌ను చూసేవ‌ర‌కూ షామ్ జీవించే ఉన్నాడు. క్యాన్స‌ర్ కి చికిత్స త‌ర్వాత ప‌దేళ్లు బ‌తికితే చాల‌నుకున్నాడు. కానీ రెండు ద‌శాబ్ధాలుగా ఆయ‌న జీవించే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. ఇది అత‌డికి పున‌ర్జ‌న్మ లాంటిది. షామ్ కౌశ‌ల్ స్ఫూర్తివంత‌మైన ప్ర‌యాణం ఎంద‌రికో స్ఫూర్తినిస్తుంది. ఈరోజు వార‌సుడు విక్కీ కౌశ‌ల్, వీరూ దేవ‌గ‌న్ కుమారుడు అజ‌య్ దేవ‌గ‌న్ తో పోటీప‌డుతూ రేసులో దూసుకుపోతుండడం చూస్తుంటే, షామ్ కౌశ‌ల్ కి ఇంత‌కంటే గ‌ర్వ‌కార‌ణం ఇంకేమి కావాలి? విక్కీ కౌశ‌ల్ ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయిక క‌త్రిన కైఫ్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. విక్కీ సోద‌రుడు స‌న్నీ కౌశ‌ల్ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నాడు.

Tags:    

Similar News