సెట్స్ నుంచి స్టార్ల ఫోటోల లీక్‌తో 'కింగ్' డైరెక్ట‌ర్ వార్నింగ్

ఈ పరిణామాల నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు.;

Update: 2026-05-03 14:30 GMT

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `కింగ్` సెట్స్ నుండి తాజాగా కొన్ని ఫోటోలు లీక్ అవ్వడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. కేప్ టౌన్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ నుండి షారూఖ్ ఖాన్ -దీపికా పదుకొణె ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నా.. చిత్ర బృందం మాత్రం సినిమాలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఇలా బయటకు రావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు. అనధికారిక కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన అభిమానులను, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను కోరారు. ప్రేక్షకులకు అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించేందుకు తమ టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోందని.. అధికారికంగా తాము విడుదల చేసే వరకు ఓపిక పట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమాలోని ఆసక్తిని కాపాడటంలో అభిమానుల సహకారం కావాలని కోరారు.

`కింగ్` సినిమా షారూఖ్ ఖాన్ అభిమానులకు అత్యంత ప్రత్యేకం కావడానికి మరో ముఖ్య కారణం ఆయన కుమార్తె సుహానా ఖాన్. ఈ చిత్రం ద్వారా సుహానా పూర్తి స్థాయి పాత్రలో వెండితెరపై అరంగేట్రం చేయబోతోంది. గతంలో ఈ క్యూటీ `ది ఆర్చీస్`తో ఓటీటీలోకి అడుగుపెట్టినా.. తన తండ్రితో కలిసి ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి. ఈ తండ్రీ కూతుళ్ల కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్టార్ కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. షారూఖ్, సుహానా, దీపికా పదుకొణెలతో పాటు అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, అభయ్ వర్మ, రాఘవ్ జుయల్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండటంతో `కింగ్` బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రస్తుతం కేప్ టౌన్ వంటి అంతర్జాతీయ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కథాంశాన్ని మేకర్స్ ఎంతో రహస్యంగా ఉంచుతున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న `కింగ్` క‌థ‌పై ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన లీకులేవీ లేవు. కానీ కొన్ని ఫోటోల లీకుల‌తో క‌థేంటో తెలిసిపోయే అవ‌కాశం ఉంది. అందుకే టీమ్ కంగారు ప‌డుతోంది. ఈ సంవత్సరంలోనే అతిపెద్ద బాలీవుడ్ రిలీజ్ ల‌లో కింగ్ ఒక‌టి. లీకుల వల్ల ఏర్పడిన అంతరాయాన్ని అధిగమించి.. చిత్ర యూనిట్ మళ్ళీ షూటింగ్‌పై దృష్టి సారించింది.

Tags:    

Similar News