మానవత్వానికి మతం అడ్డేంటి?
సినిమా రంగంలో ఒక కళాకారుడు మరో కళాకారుడికి చేసే సాయం వెనుక మతపరమైన కోణాలు వెతకడం అనాగరికమని `దేవుల్ బంద్ 2` దర్శకుడు ప్రవీణ్ తర్డే అభిప్రాయపడ్డారు.
సినిమా రంగంలో ఒక కళాకారుడు మరో కళాకారుడికి చేసే సాయం వెనుక మతపరమైన కోణాలు వెతకడం అనాగరికమని `దేవుల్ బంద్ 2` దర్శకుడు ప్రవీణ్ తర్డే అభిప్రాయపడ్డారు. ఇటీవల దేవుల్ బంద్ 2 విడుదలకు సంబంధించి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చూపిన ఉదారతపై నెట్టింట జరుగుతున్న మతపరమైన చర్చలను ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమా పరిశ్రమలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం సహకరించుకోవడాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.
`దేవుల్ బంద్ 2` సినిమా విడుదల సమయానికి డిజిటల్ సినిమా ప్యాకేజీ ఖర్చుల నిమిత్తం 42 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. ఆ సమయంలో చిత్ర బృందం వద్ద తగినంత ఆర్థిక వనరులు లేకపోవడంతో దర్శకుడు ప్రవీణ్ తర్డే షారుఖ్ ఖాన్ కంపెనీని సంప్రదించి కొంత రాయితీ ఇవ్వవలసిందిగా కోరారు. పరిస్థితిని అర్థం చేసుకున్న షారుఖ్ ఖాన్, సినిమా నాణ్యతపై తన బృందం నుంచి సానుకూల స్పందన రావడంతో వెంటనే ఆ ఖర్చును మాఫీ చేసి చిత్రాన్ని విడుదల చేసేలా వెసులుబాటు కల్పించారు.
అయితే ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలకు దిగారు. హిందూ దైవానికి సంబంధించిన కథాంశంతో రూపొందిన సినిమాకు ఒక ముస్లిం నటుడు సాయం చేయడమేంటని? దీని వెనుక ఏదైనా మతపరమైన ఉద్దేశం ఉందా ? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రవీణ్ తర్డే ధీటుగా స్పందించారు.
`ఒక మంచి సినిమాను ప్రోత్సహించడం కష్టాల్లో ఉన్న తోటి కళాకారుడికి అండగా నిలవడంలో హిందూ-ముస్లిం గొడవ ఎక్కడ ఉంది? అని సూటిగా ప్రశ్నించారు. తనకు హిందూత్వ సిద్ధాంతం పట్ల పూర్తి నిబద్ధత ఉందని, దానిని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. షారుఖ్ ఖాన్ చేసిన సాయాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం తన బాధ్యత అని, దీనికి మతంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మనిషి మంచివాడా? కాదా? అన్నదే ప్రామాణికం కావాలి తప్ప వారి మతం కాదని ప్రవీణ్ తర్డే తనదైన శైలిలో వివరించారు.
`దేవుల్ బంద్ 2` సినిమా రైతుల ఆత్మహత్యలు, విశ్వాసం , హేతువాదం మధ్య ఉన్న సంఘర్షణ వంటి సున్నితమైన అంశాలను చర్చించింది. ఇలాంటి సామాజిక బాధ్యత గల చిత్రాలు ప్రజల్లోకి వెళ్లడం ముఖ్యమని భావించిన షారుఖ్ ఖాన్ ఆ సినిమా విజయంలో తనవంతు పాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆ సినిమా కంటెంట్ పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు నిదర్శనం.
కళకు హద్దులుండవని సృజనాత్మకతకు తోడ్పాటు అందించే ప్రతి అడుగును గౌరవించాలని ఈ సంఘటన చాటి చెబుతోంది. విద్వేషపూరితమైన చర్చల కంటే మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే కళా రంగం మరింతగా వికసిస్తుందన్న సత్యాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. తోటి మనిషికి చేసే సాయం వెనుక మతం వెతకడం మానేసి కళాత్మక విలువలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.