'కుబేర' నా తల్లి.. సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూసే మూవీ: శేఖర్ కమ్ముల
జూన్ 20న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమాను ఉద్దేశించి మాట్లాడారు.;
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే చాలు.. అందరూ భారీ అంచనాలు పెట్టుకుంటారు. స్పెషల్ గా ఉంటాయని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే అద్భుతమైన సినిమాలను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించి సూపర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు కుబేర మూవీతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్నారు శేఖర్ కమ్ముల. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన సినిమాను ఆయన తెరకెక్కించారు. జూన్ 20న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల సినిమాను ఉద్దేశించి మాట్లాడారు.
అయితే కుబేర మూవీ వర్క్స్ ప్రస్తుతం ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. అందుకే పూర్తి స్థాయి ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నానని.. వర్క్ కంప్లీట్ అవ్వగానే పాల్గొంటానని చెప్పారు. తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. 25 ఏళ్ల కెరీర్ వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని మూవీలు చేశానా అని అనిపిస్తోందన్నారు.
ఒక్కో మూవీని కూతురు.. కొడుకు.. అంటూ చెప్పుకుంటూ చేశానని చెప్పారు. అయితే కొన్ని తప్పులు జరిగి ఉంటాయని, కానీ ప్రతిసారీ తాను నిజాయతీగానే ప్రయత్నించానని పేర్కొన్నారు. ఇప్పుడు కుబేర మూవీ తనకు తల్లి లాంటిదని చెప్పారు. తల్లి ప్రేమతో సమానమని చెప్పారు. గొప్ప సినిమాను ఆడియన్స్ చూడబోతున్నారని తెలిపారు.
కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా ఒకటే కావాలని చెప్పే స్టోరీతో మూవీ తీశానని.. ఇలాంటి కథతో కుబేర సినిమా తీయడం తన అదృష్టమని చెప్పారు. ధనవంతుడైనా, యాచుకుడైనా తల్లి ప్రేమలో మార్పు ఉండదని తెలిపారు. సరస్వతీ దేవి తలవంచుకోకుండా ఉంటే చాలు అని తన గత చిత్రాల విషయంలో ఎప్పుడూ చెప్పేవాడినని శేఖర్ గుర్తు చేసుకున్నారు.
కానీ కుబేర మూవీని సరస్వతి దేవి తల ఎత్తుకుని చూస్తుందని వ్యాఖ్యానించారు. తాను గర్వంతో చెబుతున్న మాట కాదని.. కొత్త టాపిక్ తో సినిమా తీశానని చెప్పారు. ఎమోషన్, కామెడీ, థ్రిల్ సహా అన్ని అంశాలు ఉంటాయని, అందరికీ కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకమైన మూవీ అని చెప్పారు. సినిమాలో నటించిన క్యాస్టింగ్ అంతా అద్భుతంగా సపోర్ట్ చేశారని.. అదరగొట్టారని కొనియాడారు. థాంక్స్ చెప్పాల్సిన వాళ్ల పేర్లను పుస్తకంలో రాసుకుని మరీ చదివి ఆకట్టుకున్నారు.