ఎందుకు నిబ్బా- నిబ్బీ సినిమాలు? ఏం లాభం?

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా స్కూల్, ఇంటర్మీడియట్ ఏజ్ ప్రేమ కథలపై ఆధారపడిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి.;

Update: 2026-03-31 02:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా స్కూల్, ఇంటర్మీడియట్ ఏజ్ ప్రేమ కథలపై ఆధారపడిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటున్నాయి? అనే ప్రశ్న.. ఇప్పుడు వినిపిస్తోంది. ఆ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఇటీవల విడుదలైన కోర్ట్ వంటి సినిమాలు సమాజానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తీసుకుని.. ఈజీ వేలో చెప్పడంతో ప్రశంసలు అందుకున్నాయి. ఒక సాధారణ మనిషి ఎదుర్కొనే సమస్యలను నిజాయితీగా చూపించిన ఆ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే అదే నటీనటులు లేదా టెక్నీషియన్లు తీసిన బ్యాండ్ మేళం వంటి సినిమాలు మాత్రం పూర్తిగా విరుద్ధంగా నిలుస్తున్నాయి. కథలో డెప్త్ లేకుండా.. అర్థం లేని ప్రేమ కథలతో తెరకెక్కిన ఆ మూవీలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కథనం, ఎమోషన్స్, లాజిక్ వంటి అంశాలు లేకపోవడం వల్ల ఇవి క్రింజ్ కంటెంట్‌ గా మిగిలిపోతున్నాయి.

ఇదే పరిస్థితి తమిళ సినిమాల్లో కూడా కనిపిస్తోంది. అక్కడ హిట్ అయిన కొన్ని సినిమాలు తెలుగులో మాత్రం పనిచేయకపోవడం గమనార్హం. ముఖ్యంగా స్కూల్ వయసు పిల్లల ప్రేమ కథలపై తీసిన సినిమాలు కొంతమందికి నచ్చినా, ఎక్కువ మంది ప్రేక్షకులకు అవి అసహజంగా అనిపిస్తున్నాయి. చిన్న వయసులోని ప్రేమను కామెడీగా చూపించే ప్రయత్నంలో చాలా సినిమాలు హద్దులు దాటుతున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల వచ్చిన యూత్, హ్యాపీ రాజ్ వంటి సినిమాలు కూడా ఇదే ట్రెండ్‌ ను కొనసాగిస్తున్నాయి. ఇక త్వరలో రాబోయే అనకాపల్లి వంటి సినిమాలు ఇదే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్నాయని టాక్. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల మధ్య జరిగే ప్రేమ, కామెడీ సన్నివేశాలే ప్రధానంగా చూపిస్తున్నారు. కానీ ఇవి నిజ జీవితానికి ఎంతవరకు దగ్గరగా ఉంటాయో అనే డౌట్ ప్రేక్షకుల్లో ఉంది.

దీంతో అలాంటి కథలు ఎందుకు వస్తున్నాయి? వీటికి నిజంగా డిమాండ్ ఉందా? లేక నిర్మాతలు, దర్శకులు సులభంగా తీయగలిగే కథలు కావడంతోనే దారిని ఎంచుకుంటున్నారా? అని సినీ ప్రియులు క్వశ్చన్ చేస్తున్నారు. యూత్ ఆడియన్స్ ను ఆకర్షించాలనే ఉద్దేశంతో అలాంటివి రూపొందుతున్నాయని, తక్కువ బడ్జెట్‌ తోపాటు కొత్త నటీనటులతో తీసే వీటి వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు.

కానీ కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోతే, సినిమా ఎంత చిన్నదైనా ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారన్న విషయం ఇప్పటికే అనేక సార్లు రుజువైందని చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఆ ట్రెండ్‌ కు కారణమని అంటున్నారు. మొత్తానికి నిబ్బా-నిబ్బీ తరహా సినిమాలు కొంతమందికి సరదాగా అనిపించినా, పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కంటెంట్, ఎమోషన్స్, నిజాయితీ అవసరం. లేకపోతే ఆ ట్రెండ్ ఎక్కువ కాలం నిలబడదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News