రజనీ కూలీలో సిసలైన షో స్టాపర్ ఇతడే
మలయాళంలో కాస్త ఆలస్యంగా పాపులరైన స్టార్‌గా ఇప్పుడు అతడు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం వార్ 2తో పోటీపడుతూ భారీ వసూళ్లను సాధించింది. ఓపెనింగ్ వీకెండ్ లోనే వార్ 2 కంటే 100 కోట్లు అధికంగా వసూలు చేసిందంటే రజనీ స్టామినా, స్టార్ పవర్ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ ఫ్యాన్స్ లో మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో ఓపెనింగులు చూపించాయి. దానికి తోడు నాగార్జున స్టార్ డమ్ కూడా ఈ సినిమా ఆరంభ వసూళ్లకు అదనపు బలం కాగా, ఈ చిత్రంలో ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ స్టార్లు కూడా నటించిన సంగతి తెలిసిందే.
అదంతా అటుంచితే ఇంత మంది స్టార్ల మధ్య కూడా షోస్టాపర్ గా నిలిచిన మరొక నటుడి గురించి కూడా సోషల్ మీడియాల్లో ప్రధానంగా చర్చ సాగుతోంది. అతడే మలయాళీ సౌబిన్ షాహిర్. కూలీ బ్రేక్ అవుట్ స్టార్‌గా అతడు షోని దొంగిలించాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా `మోనికా` పాటలో పూజా హెగ్డేను కూడా వెనక్కి నెట్టేశాడని నెటిజనులు పొగిడేస్తున్నారు. ఇటీవల మంజిమ్మల్ బోయ్స్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సౌబిన్ ఆ చిత్రంలో నటుడిగానే కాదు, నిర్మాతగాను పాపులరయ్యారు.
మలయాళంలో కాస్త ఆలస్యంగా పాపులరైన స్టార్‌గా ఇప్పుడు అతడు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సౌబిన్ దశాబ్ధాల పాటు మలయాళ పరిశ్రమలో ఉన్నాడు. 2000లలో ఫాజిల్, సిద్ధిక్, రఫీ-మెకార్టిన్, పి. సుకుమార్, సంతోష్ శివన్, రాజీవ్ రవి, అమల్ నీరద్ లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 30 సంవత్సరాల వయసులో సౌబిన్ `అన్నయుమ్ రసూలం` సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా అడుగుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ప్రేమమ్ బిగ్ బ్రేకింగ్ పాయింట్. 34 సంవత్సరాల వయసులో `సుడానీ ఫ్రమ్ నైజీరియా`లో లీడ్ పాత్రలో నటించి, కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. 2017లో అతను `పరవ` సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కుంబలంగి నైట్స్, మంజుమ్మెల్ బాయ్స్ చిత్రాలలో తన ప్రధాన పాత్రలతో సౌబిన్ కేరళ వెలుపల కూడా ఆదరణ పొందాడు. మంజుమ్మల్ బోయ్స్ అతడి పేరు మార్మోగేలా చేసింది. ఈ సినిమాతో అతడు నిర్మాతగాను మారాడు. మొదటిసారి తమిళంలో కూలీలో పూర్తి స్థాయి పాత్రలో అవకాశం అందుకుని నిరూపించుకున్నాడు. అతడి పాత్ర నాగార్జునకు సహాయకుడు. సైమన్ (నాగార్జున) అనుచరుడు దయాల్ పాత్రలో నటించాడు. ఈ పాత్రను ప్రజలు విపరీతంగా అభిమానించారు.
#కూలీలో #సౌబిన్ షాహిర్ ది షో స్టీలర్ అంటూ ప్రశంసలు కూడా దక్కాయి. #సౌబిన్ షాహిర్ తన అద్భుతమైన నటనకు సహాయ నటుడిగా జాతీయ అవార్డుకు అర్హుడు అని కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక మోనికా పాటలో పూజా హెగ్డేతో పోటీపడుతూ అతడు డ్యాన్స్ చేసిన తీరు విస్మయపరిచింది. అతడు ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్సులు చేసి అలరించాడు. ఈ పాట క్లిప్‌ను షేర్ చేసి `నిజమైన షోమ్యాన్ కనిపించే వరకు..! 41 ఏళ్ల బాలుడు #సౌబిన్ షాహిర్ మొత్తం పాటను దొంగిలించాడు! అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌబిన్ తదుపరి తళా అజిత్ సినిమాలో అవకాశం అందుకున్నాడంటూ ప్రచారం సాగుతోంది. కానీ దీనికి అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. భాషతో సంబంధం లేకుండా ప్రతిభకు అవకాశాలు లభిస్తాయి అనడానికి సౌబిన్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు.