డైరెక్టర్ గా లావణ్య.. సతీ లీలావతిపై లావణ్య నెక్ట్స్ లెవెల్ కాన్ఫిడెన్స్!
టాలీవుడ్‌లో కంటెంట్‌తో పాటు క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, ప్రేక్షకులకు నవ్వులు పంచే మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సతీ లీలావతి సిద్ధమవుతోంది.;
టాలీవుడ్‌లో కంటెంట్‌తో పాటు క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, ప్రేక్షకులకు నవ్వులు పంచే మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సతీ లీలావతి సిద్ధమవుతోంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌కు ముందు చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేయగా, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ, సతీ లీలావతి చిత్రంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటికే సినిమా చూసిన ఆమె, ఇది పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందని, ముఖ్యంగా కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. షూటింగ్ సమయంలోనే తాను గర్భవతిని అని తెలిసిందని, అయినప్పటికీ టీమ్ సపోర్ట్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిని పూర్తి చేసుకున్నానని వెల్లడించారు. ప్రతి రోజూ షూటింగ్ తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకోవాల్సి వచ్చిందని, కొన్ని సీన్స్ లో శారీరకంగా కష్టమైనా, పాత్ర కోసం ఎంతో కట్టుబాటుతో పనిచేశానని చెప్పారు. ఇకపై ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌లకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని కూడా పేర్కొన్నారు.
ఈ సినిమాలో తాను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తానని, కథలో వినోదం, భావోద్వేగాలు సమపాళ్లలో ఉంటాయని లావణ్య వివరించారు. మంచి మెసేజ్ ఉన్నప్పటికీ, అది ఎక్కడా క్లాస్ పీకుతున్నట్టు అనిపించదని, ప్రేక్షకులు సహజంగా కనెక్ట్ అయ్యేలా కథనం ఉంటుందని అన్నారు. తన మేనేజర్‌తో కలిసి సినిమా చూసేటప్పుడు అనేక సన్నివేశాల్లో నవ్వులు ఆపుకోలేకపోయామని చెప్పడం, సినిమాలోని కామెడీ లెవెల్‌ను సూచిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా తొలిసారి పాల్గొన్నానని, ముఖ్యంగా ఒక ఫైట్ సీన్‌లో కాస్త ఇబ్బంది అనిపించినా, ఆ అనుభవం కొత్తగా అనిపించిందని లావణ్య చెప్పారు.
పర్సనల్ లైఫ్ పై మాట్లాడిన లావణ్య, తాను ప్రస్తుతం భర్త వరుణ్‌తో పాటు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని తెలిపారు. సినిమా కథలో చూపిన రిలేషన్‌షిప్‌లకు రియల్ లైఫ్ లో పోలికలు ఉండవని, అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని అభిప్రాయపడ్డారు. తన కెరీర్ విషయంలో ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకుని, కుటుంబానికి సమయం కేటాయించాలని భావిస్తున్నానని వెల్లడించారు. అలాగే, ఫ్యూచర్ లో వరుణ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తానని చెప్పారు.
సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి కూడా లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ద్వారా సినిమాకు మంచి రీచ్ వచ్చిందని, ఆయనెప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారని పేర్కొన్నారు. చిరంజీవి కూడా తమలాంటి కొత్త ప్రాజెక్ట్‌లను ఎంకరేజ్ చేస్తారని తెలిపారు. కో యాక్టర్ దేవ్ మోహన్ టాలెంట్ ను ప్రశంసించిన ఆమె, తాను కూడా ఈ సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు ట్రై చేశానని చెప్పారు.
మొత్తానికి సతీ లీలావతి సినిమా హాస్యంతో పాటు హృదయాన్ని తాకే అంశాలను మిళితం చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ క్లాసిక్‌తో పోల్చకూడదని స్పష్టం చేసిన లావణ్య, తమ సినిమా ప్రత్యేకమైన వినోదాన్ని అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. రిలీజ్ కు ముందు నుంచే మంచి బజ్ సంపాదించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలా మెప్పిస్తుందో చూడాలి.