కోటా విషాదం నుంచి కోలుకుండానే టాలీవుడ్ లో మరో విషాదం
కోటా శ్రీనివాసరావు చనిపోయిన వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.;
కోటా శ్రీనివాసరావు చనిపోయిన వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి నటి బి. సరోజా దేవి కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సరోజా దేవి బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో 87 ఏళ్ల వయసులో తన తుదిశ్వాసను విడిచారు. సరోజా దేవి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారు.
సరోజా దేవి మరణ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కరోజు తేడాలో ఇద్దరు గొప్ప నటుల్ని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటుగా భావిస్తున్నారు. వందల చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆమె కన్నడ సినిమా మహాకవి కాళిదాసుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.
ఆ తర్వాత రెండేళ్లకు పాండురంగ మహాత్మ్యం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆమె సుమారు 180 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, మంచి చెడు, ఇంటికి దీపం ఇల్లాలే సహా ఎన్నో హిట్ సినిమాలు చేశారు.
సరోజా దేవి తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసినా తమిళ ప్రేక్షకులు మాత్రం ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. అందులో భాగంగానే తమిళ స్టార్ హీరోలందరితోనూ ఆమె సినిమాలు చేశారు. ఎంజీఆర్ తో 26 సినిమాలు చేసిన సరోజ, శివాజీ గణేషన్ తో 22 సినిమాలు, జెమినీ గణేషన్ తో 17 సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శ్రీహర్ష అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సరోజా దేవికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. ఆమె నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా అధవన్. తెలుగులో దాన్ని ఘటికుడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. సరోజా దేవి మృతి పట్ల సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.