మెరుపు వెలుగులో చెలి కన్నులలో...ఆమె ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ !
ఆమెని అభినయ సరస్వతిగా కీర్తించారు. పాత తరాల వారు ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ గా కొలిచారు. ముఖ్యంగా యాభై అరవై దశకాలలో ఆనాటి యువతరం ఆమెను వెండి తెర దేవతగా ఆరాధించారు;
ఆమెని అభినయ సరస్వతిగా కీర్తించారు. పాత తరాల వారు ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ గా కొలిచారు. ముఖ్యంగా యాభై అరవై దశకాలలో ఆనాటి యువతరం ఆమెను వెండి తెర దేవతగా ఆరాధించారు. ఆమె ఎవరో కాదు బీ సరోజాదేవి. అలనాటి హీరోయిన్. తెలుగు కన్నడ తమిళ్ ఇలా దక్షిణాది భాషా చిత్రాలలో వరసగా నటిస్తూ ఆనాటి దిగ్గజ నటులు ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎంజీఆర్ శివాజీ గణేశన్ కన్నడంతో రాజ్ కుమార్ వంటి వారితో ఆమె హీరోయిన్ గా మెరిసి అలనాటి తరాన్ని మురిపించారు.
ఆమె వృద్ధాప్య సమస్యతో తన 87వ ఏట ఈ లోకాన్ని వీడారు. అయితే బీ సరోజాదేవి పేరు చెప్పగానే తెలుగులో కొన్ని సినిమాలు ఠక్కున గుర్తుకు వస్తాయి. ఇక వాన పాటలకు శుభారంభం పలికిన జగపతి సంస్థ వారి ఆత్మబలం చిత్రంలో బీ సరోజాదేవి అక్కినేని మీద చిత్రీకరించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ అయితే ఈ రోజుకీ ఎవరూ మరచిపోరు.
చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడు సరసన ఉంటే అంటూ పరుగులు తీసిన ఆచార్య ఆత్రేయ వారి కలానికి కేవీ మహాదేవన్ జోరైన సంగీత బాణీలను ఇస్తే ఘంటసాల సుశీల అద్భుతంగా ఆలపించారు. ఇక వెండి తెర మీద నాగేశ్వరరావు సరోజాదేవి నటన ఎప్పటికీ మెచ్చుకోలుగానే ఉంటుందని చెప్పాలి.
ఈ పాట గురించి అక్కినేని వారే 2006లో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ సభలో చెప్పారు. ఆ వానపాటలో తాము చలికి వణుకుతూ వానకు తడుస్తూ నానా ఇబ్బందులు పడుతూ చేశామని, అది వెండి తెర మీద జనాలను అలరించడానికి తెర వెనక మేము ఎన్ని పాట్లు పడ్డామో ఎవరికి తెలుసు అని ఆయన చమత్కార పూరితంగా తన పక్కన బీ సరోజాదేవి ఉండగానే ఈ మాటలు చెప్పారు. ఆమె సైతం ఆనాటి పాట గుర్తులను నాటి సభలో తలచుకున్నారు.
ఈ పాట సందర్భంలో బీ సరోజాదేవి తలకు కట్టు ఉంటుంది. ఆమెకు ఏదో గాయమైందని దాంతో కవర్ చేయడానికి రుమాల్ ని తలకు కట్టుగా కట్టి ఈ పాటని షూట్ చేశారని చెబుతారు. అలా పూర్తి అంకితభావంతో బి సరోజాదేవి ఈ వానపాటలో నటించారు. ఇక యువతకు నాటికీ నేటికీ గిలిగింతలు పెట్టే వానపాటలలో అగ్రతాంబూలం దీనిదే.
ఈ పాటలో ఆత్రేయ ఎన్నో అందమైన మాటలే వాడారు. మెరుపు వెలుగులో చెలి కన్నులలో అని ఒక అద్భుతమైన పద ప్రయోగం చేశారు. మెరుపు అంటేనే క్షణికం. ఆ లిప్తపాటు వెలుగులో చెలి కన్నులను కధానాయకుడు బిత్తర చూపులను గమనించారని రాయడం ఆత్రేయకే చెల్లితే అంత అందంగా బిత్తర చూపులతో రక్తి కట్టించారు బీ సరోజాదేవి.
ఆమెవి అందమైన కళ్ళు. అందుకే చాలా పాటలలో ఆమె కళ్ళను క్లోజ్ షాట్స్ తో షూట్ చేసి మరీ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు నాటి దర్శకులు. ఇక ఎన్టీఆర్ తో ఆమె చేసిన మంచి చెడులో మరో డ్యూయెట్ కూడా ఆత్రేయ రాసినదే. రేపంటి రూపం కంటి అంటూ సాగే ఆ పాటలో కూడా ఎన్టీఆర్ బీ సరోజాదేవి పోటాపోటీగా తమ అందంతో అలరిస్తారు.
కన్నడంలో పుట్టిన బి సరోజాదేవి తెలుగు తెర మీద ప్రవేశించింది ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ ఎన్ఏటీ ద్వారా. అలా 1955లో వచ్చిన పాండురంగ మహత్యం సినిమాలో ఆమె కీలక పాత్ర కోసం ఎంపిక అయ్యారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె తెలుగులో మరిన్ని చాన్సులు అందుకున్నారు. ఇక జగదేకవీరుని కధలో జలకాటలలో అన్న పాటలో ఆమె దివి నుంచి దిగి వచ్చిన గంధర్వ కన్యగానే కనిపిస్తారు.
ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి చేసిన రావణుడి పాత్రతో రూపొందిన సీతారామ కళ్యాణంతో ఆమె మండోదరిగా మెరిసి అశేష జనాన్ని విశేషంగా అలరించారు. మెల్ల మెల్ల మెల్లగా అంటూ సాగే మరో అద్భుతమైన డ్యూయెట్ దాగుడుమూతలు సినిమాలో ఉంటుంది. ఎన్టీఆర్ బీ సరోజాదేవి కాంబినేషన్ లో ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తుంది. అడగక ఇచ్చిన మనసే ముద్దు అంటూ మరో రసరమ్యమైన పాట కూడా ఈ సినిమాలోనిదే. బీ సరోజాదేవి కళ్ళతోనే అనేక భావాలని పలికించి మురిపించిన పాటగా అంతా గుర్తుంచుకుంటారు.
సూపర్ స్టార్ క్రిష్ణ సొంత సినిమా పండంటి కాపురంలో ఆయనకు ఒదినగా కీలక పాత్రలో బీ సరోజాదేవి కనిపిస్తారు. ఆమెని ఆటపట్టిస్తూ క్రిష్ణ పాడే ఏవమ్మా జగడాల వదినమ్మో ఆ రోజులలో సూపర్ హిట్ గా చెప్పుకుంటారు. ఇక దానవీర శూరకర్ణలో కర్ణుడి పాత్ర ధారి అయిన ఎన్టీఆర్ సతీమణిగా ఆమె అలరించారు. అలాగే 1992లో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో కూడా ఆమె ఎన్టీఆర్ తో కలసి కనిపిస్తారు. అలా చూస్తే కనుక ఎన్నో తెలుగు సినిమాల్లో ఆమె చక్కని నటనను ప్రదర్శించి ఆకట్టుకున్నారని చెప్పాలి.