పెళ్లిళ్లు పెటాకులు కావచ్చు: వివాహ బంధంపై యువ న‌టి విరక్తి

బాలీవుడ్ స్టార్ కిడ్, యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ వివాహ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను న‌టించిన తాజా సినిమా ప్రమోషన్లలో భాగంగా వివాహ బంధంపై మాట్లాడిన సారా.. పెళ్లిళ్లు పెటాకులు కావొచ్చున‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

Update: 2026-05-18 18:30 GMT

బాలీవుడ్ స్టార్ కిడ్, యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ వివాహ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను న‌టించిన తాజా సినిమా ప్రమోషన్లలో భాగంగా వివాహ బంధంపై మాట్లాడిన సారా.. పెళ్లిళ్లు పెటాకులు కావొచ్చున‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. తాను పెళ్లిని కేవలం ఒక అందమైన ఊహలా చూడనని, చాలా ప్రాక్టికల్ కోణంలోనే వీక్షిస్తానని క్లారిటీ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితంలో వివాహ బంధాలు విచ్ఛిన్నమవ్వడం కళ్లారా చూసినందువల్లే తనకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని ఆమె ఓపెన్ అయ్యారు.

ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామిఖా గబ్బిలతో కలిసి ఆమె నటించిన `పతి పత్ని ఔర్ వో దో` చిత్రం మే 15న విడుదలై.. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 17.53 కోట్ల నెట్ కలెక్షన్లతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో పెళ్లి, వ్య‌క్తిగ‌త జీవితం గురించి సారా ఘాటుగా మాట్లాడింది.

సారా అలీ ఖాన్ తల్లిదండ్రులైన సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లు 1991లో పెళ్లి చేసుకుని.. 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ మరో నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకోగా.. సారా తల్లి అమృతా సింగ్ మాత్రం పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోయారు. ఈ చేదు నిజాలను దగ్గరగా చూసిన సారా.. పెళ్లిళ్లు కొన్నిసార్లు అనుకోని విధంగా పెటాకులు కావచ్చునని... అందుకే తొందరపడి బంధాలలోకి దూకడం కంటే వేచి చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడటం కంటే... జీవితానికి సరిపోయే `కరెక్ట్` వ్యక్తి కోసం ఎంత కాలమైనా నిరీక్షించడమే ఉత్తమమని సారా స్పష్టం చేశారు.

కేవలం సమాజం కోసం లేదా ఒక భాగస్వామి ఉండాలి కదా అనే కారణంతో పెళ్లి చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని సారా కుండబద్దలు కొట్టారు. ఒకవేళ సరైన వ్యక్తి దొరకకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి కూడా తాను మానసికంగా సిద్ధమేనని ప్రకటించారు. తన జీవితంలో ఏదో వెలితి ఉందని... దాన్ని పూర్తి చేయడానికి మరొకరు రావాల్సిన అవసరం లేదని.. తనలో తాను ఒక సంపూర్ణ వ్యక్తిగా ఎదగడమే తన ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. తనను తాను ఒక `గ్రీన్ ఫ్లాగ్`గా అభివర్ణించుకున్న ఈ యంగ్ బ్యూటీ.. తన అస్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని... ప్రస్తుతానికి కేవలం సినిమాలు, కెరీర్‌పైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

సారా అలీ ఖానే కాదు.. ప్రస్తుత బాలీవుడ్‌లో మెజారిటీ యంగ్ కథానాయికలు వివాహ వ్యవస్థ విష‌యంలో సరైన లేదా సానుకూల అభిప్రాయాన్ని కలిగి లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో నిత్యం చూసే విడాకులు, విచ్ఛిన్నమవుతున్న సెలబ్రిటీల బంధాలు చూసి నేటి తరం నటీమణులు పెళ్లి విషయంలో ఒక రకమైన విరక్తిని, అపనమ్మకాన్ని పెంచుకుంటున్నారు. సాంప్రదాయ వివాహ వ్యవస్థ ఇచ్చే భద్రత కంటే తమ సొంత కెరీర్, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛకే వారు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లిని జీవితంలో ఒక భాగస్వామ్యంగా కాకుండా తమ ఎదుగుదలకు అడ్డుపడే ఒక బంధనంగా భావించే ధోరణి నేటి బాలీవుడ్ హీరోయిన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News