తమ్ముడితో సప్తమి తప్పు చేసిందా...!

తాజాగా కర్ణాటక నుంచి సప్తమి గౌడ కూడా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కాంతర సినిమాతో ఈ అమ్మడికి తెలుగులో ఇప్పటికే గుర్తింపు లభించింది.;

Update: 2025-07-12 06:15 GMT

కన్నడ సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో అడుగు పెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న హీరోయిన్‌ రష్మిక మందన్న కన్నడ బ్యూటీ అనే విషయం తెల్సిందే. రష్మిక మందన్న మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో ఇంకా ఎంతో మంది బెంగళూరు ముద్దుగుమ్మలు ఉన్నారు. తాజాగా కర్ణాటక నుంచి సప్తమి గౌడ కూడా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కాంతర సినిమాతో ఈ అమ్మడికి తెలుగులో ఇప్పటికే గుర్తింపు లభించింది. కాంతార సినిమాతో వచ్చిన పాపులారిటీ కారణంగా తెలుగులో పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. కానీ ఈమె మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చింది.

కాంతార సినిమాలో కనిపించిన పాత్ర తరహాలోనే ఆఫర్లు వచ్చాయట. ఎక్కువ శాతం పల్లెటూరు నేపథ్యంలో అమ్మాయిగా, ముక్కు పుడక పెట్టుకుని, లంగా ఓణి ధరించే పాత్రలు రావడంతో వాటిని తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. కాంతార సినిమా తర్వాత తనకు వచ్చిన ఆఫర్లన్నింటిని చేసి ఉంటే ఇప్పటికే తన సినిమాల సంఖ్య భారీగా పెరిగి ఉండేదని చెప్పుకొచ్చింది. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చిన సప్తమి గౌడ ఇటీవలే నితిన్‌తో కలిసి నటించిన తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి సినిమాల్లో నటించొద్దని అనుకుందో, ఎలాంటి పాత్రలు చేయకూడదని అనుకుందో అదే తరహా పాత్రలో తమ్ముడు సినిమాలో ఈ అమ్మడు కనిపించింది.

మోడ్రన్‌ లుక్‌లో కనిపించాలని ఆశ పడుతున్న సప్తమి గౌడకు ఎక్కువ శాతం పల్లె నేపథ్యం ఉన్న పాత్రలు వస్తున్నాయి. తాను కోరుకుంటున్న పాత్ర కాకుండా మరో పాత్రను ఆఫర్‌ చేసినా కూడా ఎలా తమ్ముడు సినిమాకు సప్తమి గౌడ ఓకే చెప్పింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలను చేయాలని ఆశ పడుతున్న సప్తమి గౌడ ఎలా ఈ పాత్రకు కమిట్‌ అయిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కాంతార సినిమా విడుదలైన వెంటనే ఈ సినిమాకు ఒప్పుకుందా అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. తమ్ముడు సినిమా దాదాపుగా రెండేళ్ల పాటు మేకింగ్‌ జరుపుకుంది. కొన్ని కారణాల వల్ల సినిమా నిరాశ పరిచింది.

తమ్ముడు సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే తప్పకుండా సప్తమి గౌడకు మంచి ఆఫర్లు దక్కేవి. ఒకవేళ తమ్ముడు సినిమాను చేయకున్నా టాలీవుడ్‌లో కాస్త ఆలస్యంగా అయినా మంచి ఆఫర్‌ లభించి ఉండేదేమో అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి సప్తమి తన కెరీర్‌లో పెద్ద తప్పిదంగా తమ్ముడు నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇకపై అయినా జాగ్రత్త పడకుంటే టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. తమ్ముడు చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడికి తెలుగు నుంచి మరో ఆఫర్‌ వచ్చింది. ఆ సినిమా గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News