సంక్రాంతి 2027 రేస్ లో పెరుగుతున్న పోటీదారులు.. లిస్టులో మరో స్టార్ డైరెక్టర్!

ఇప్పటికే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి అరడజనుకు పైగా భారీ చిత్రాలు రేస్‌లో ఉండగా, ఇప్పుడు ఈ లిస్టులోకి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా చేరిపోయారు.

Update: 2026-09-04 18:30 GMT

సినీ పరిశ్రమలో పండుగల సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు పెద్ద స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు ఎప్పుడూ పోటీపడుతుంటారు. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి అరడజనుకు పైగా భారీ చిత్రాలు రేస్‌లో ఉండగా, ఇప్పుడు ఈ లిస్టులోకి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా చేరిపోయారు. దీంతో సంక్రాంతి సమరం మరింత ఆసక్తికరంగా మారింది.

మణిరత్నం రొమాంటిక్ మ్యాజిక్:

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మూవీస్ కు తెలుగు లోను క్రేజ్ వుంది. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం చెన్నైలో నాన్-స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పరిమిత బడ్జెట్‌తో, వేగంగా షూటింగ్ పూర్తి చేసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

టాలీవుడ్ నుంచి దండయాత్ర:

ఈసారి సంక్రాంతికి భారీ దండయాత్రే జరగబోతోంది. జనవరి 8న ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 'మహాకాళి' విడుదల కానుండగా, జనవరి 12న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మరియు సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటి గట్టు' పోటీకి వస్తున్నాయి. ఇక జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న 'కాకా', జనవరి 14న శర్వానంద్-శ్రీను వైట్లల 'జార్జ్ క్రిష్' బరిలోనే నిలిచాయి.

తమిళంలోనూ కఠినమైన పోటీ:

కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంతో పాటు పలు తమిళ బడా ప్రాజెక్టులు పండుగ రేస్‌లో ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి లాంటి క్రేజీ స్టార్లతో మణిరత్నం వస్తుండటంతో సౌత్ ఇండియా అంతటా థియేటర్ల కేటాయింపు పెద్ద సవాలుగా మారనుంది.

ఇన్ని భారీ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద విజయం ఎవరిని వరిస్తుందో చూడడం ఆసక్తికరంగా మారింది. మాస్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలు ఒకవైపు ఉంటే, మణిరత్నం మార్క్ రొమాంటిక్ డ్రామా మరోవైపు నిలవనుంది. ఇక పండుగ రేస్‌లో ఎన్ని సినిమాలు ఉన్నా, చివరకు కంటెంట్ బాగున్న సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News