1000 కోట్ల క్లబ్ అందని ద్రాక్షేనా? అగ్రదర్శకుడి మధనం!
భారీ సెట్లు.. భారీ బడ్జెట్లు.. అగ్ర తారాగణం ఉన్నా ఈ దర్శకుడు ఇంకా 1000 కోట్ల క్లబ్ అందుకోలేదు. అతడు తన సుదీర్ఘ కెరీర్ లో ఒకే ఒక్క సినిమాతో 500కోట్ల క్లబ్ అందుకున్నాడు;
భారీ సెట్లు.. భారీ బడ్జెట్లు.. అగ్ర తారాగణం ఉన్నా ఈ దర్శకుడు ఇంకా 1000 కోట్ల క్లబ్ అందుకోలేదు. అతడు తన సుదీర్ఘ కెరీర్ లో ఒకే ఒక్క సినిమాతో 500కోట్ల క్లబ్ అందుకున్నాడు. ప్రతిసారీ అగ్ర కథానాయకులతో కలిసి పని చేస్తాడు. కళాత్మక చిత్రాల దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ ఒక్క ఫీట్ వేయలేని స్థితి.. ఈసారి ఇద్దరు 800కోట్ల క్లబ్ హీరోలతో పని చేస్తున్నాడు.. కనీసం ఇప్పుడైనా 1000 కోట్ల క్లబ్ అందుకోగలడా?
ఈ చర్చ ఎవరి గురించి? అంటే... ఒక ప్రముఖ దర్శకుడి గురించి.. అతడు మరెవరో కాదు.. సంజయ్ లీలా భన్సాలీ. తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన సినిమాలను రూపొందించారు భన్సాలీ. దేవదాస్, గుజారిష్, రామ్ లీలా.. ఇలా ఎన్నో క్లాసిక్స్ ని రూపొందించారు. కానీ ఆయన రూపొందించిన మహిళా ప్రధాన చిత్రం పద్మావత్ మాత్రమే 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవల ఆలియా నటించిన `హీరామండి` కేవలం 200 కోట్లు వసూలు చేసింది. అయితే ఆయన సినిమాల్లో కళాత్మకత, భారీ సెట్లు ఎల్లపుడూ చర్చనీయాంశం. ఆయన ఎంపిక చేసుకునే కథలు, పాత్రలు ప్రతిదీ ఉత్కంఠ పెంచేవే. కానీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ సృష్టించే మాస్ యాక్షన్ సినిమాని తెరకెక్కించలేదు.
ఇప్పటికీ అతడు తన పంథాను మార్చుకోలేదు. కానీ ఈసారి వార్ డ్రామాతో అతడు పాన్ ఇండియాలో సంచలనం సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రధారులుగా భన్సాలీ తెరకెక్కిస్తున్న `లవ్ & వార్` అతడిని 1000 కోట్ల క్లబ్ దర్శకుల జాబితాలో నిలబెడుతుందా? అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులువు కాదు. ఏదైనా సినిమా వందశాతం మాస్ ని థియేటర్లకు రప్పించినప్పుడే అది బంపర్ హిట్టు. కానీ భన్సాలీ సినిమాలు ఒక సెక్షన్ కి దూరంగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాసివ్ సంఖ్యల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. కానీ ఈసారి లవ్ అండ్ వార్ ఈ గ్యాప్‌ని ఫుల్ ఫిల్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు.
చిత్రీకరణ ఇంకా పెండింగ్‌లోనే...
భన్సాలీ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ సినిమా గురించి ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ చిత్రంలోని ఒక చిన్న గ్లింప్స్ తో అభిమానులను ఉత్సాహపరచాలని టీమ్ కోరుకుంటోంది. తాజా సమాచారం మేరకు.. జనవరి 2026లో మొదటి అధికారిక లుక్‌ను ఆవిష్కరించడానికి భాన్సాలీ టీమ్ సిద్ధమవుతోందని తెలిసింది. లవ్ అండ్ వార్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఇకపై ప్రమోషన్స్ పరంగా వేగం పెంచాలని భన్సాలీ భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకూ సెట్ నుంచి లీకైన ఫోటోలను మాత్రమే అభిమానులు చూసారు.. కానీ అధికారికంగా ఈ సినిమా గురించిన ఎలాంటి సమాచారం లీక్ కాలేదు. కొన్ని రోజుల క్రితం, ఆలియా ముంబైలో రణబీర్‌తో కలిసి ఒక పెళ్లి సన్నివేశంలో నటించింది. ఇప్పుడు ప్రధాన నటీనటులతో క్లైమాక్స్ సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. అటుపై ఆలియా షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. అయితే కథానాయకులు మరో ఆరు వారాల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు`` అని తెలిసింది. కొన్ని రోజుల క్రితం రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ పూర్తి వైమానిక దళ దుస్తులలో ఉన్న అద్భుతమైన ఫోటో ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ ఫోటో వేగంగా ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఆ ఇద్దరూ భారత వైమానిక దళ యూనిఫామ్‌లు ధరించి, ఫైటర్ జెట్ పక్కన నిలబడి కనిపించడంతో వార్ డ్రామా గురించి చాలా చర్చ సాగింది.
లవ్ & వార్ ఒక ముక్కోణపు ప్రేమకథ. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో కొనసాగే డ్రామా. ఇద్దరు ఆర్మీ అధికారులు ఒకే అమ్మాయితో ప్రేమలో పడితే, ఆ తర్వాత ఎలాంటి ఘర్షణ మొదలైంది? ఓవైపు దేశం కోసం పోరాడే ఇద్దరు వీరులు ప్రేమికురాలి కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో భన్సాలీ అద్భుతంగా చూపిస్తున్నారని చెబుతున్నారు. రణబీర్- విక్కీ ఇద్దరు అధికారులు.. విధి కోరికల మధ్య భావోద్వేగ పోరాటంలో చిక్కుకున్న అలియా భట్ తో సంక్లిష్టమైన ముక్కోణ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలనే ఉత్సాహం అందరిలోను ఉంది. వార్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం 2026 విడుదల కానుండగా, అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే ఒక అందమైన ప్రేమకథతో సినిమాని రూపొందిస్తే, అది బాక్సాఫీస్ వద్ద 500కోట్ల క్లబ్ ని సాధించడం కష్టమేమీ కాదని మోహిత్ సూరి- సయ్యారా నిరూపించింది. ఇప్పుడు అగ్ర తారాగణంతో ప్రేమకథ ఏ విధమైన మ్యాజిక్ చేస్తుంది? అన్నది వేచి చూడాలి.