సల్మాన్ తర్వాత ఇప్పుడు రణవీర్.. భయం భయంగా..
ముంబై గ్లామర్ ప్రపంచాన్ని ఇప్పుడు ఒక తెలియని భయం వెంటాడుతోంది. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ల పేర్లు వింటేనే వణికిపోయే ఇండస్ట్రీ, ఇప్పుడు కొత్త గ్యాంగ్‌ల బెదిరింపులతో సతమతమవుతోంది.;
ముంబై గ్లామర్ ప్రపంచాన్ని ఇప్పుడు ఒక తెలియని భయం వెంటాడుతోంది. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ల పేర్లు వింటేనే వణికిపోయే ఇండస్ట్రీ, ఇప్పుడు కొత్త గ్యాంగ్‌ల బెదిరింపులతో సతమతమవుతోంది. గతంలో సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్లపై దాడులు జరిగినప్పుడు అవి వ్యక్తిగత కారణాలని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం పక్కా మాఫియా స్టైల్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సల్మాన్ ఖాన్ విషయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎంత రచ్చ చేస్తోందో తెలిసిందే. ఐదు కోట్లు ఇవ్వకపోతే బాబా సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితి ఉంటుందని ఆమధ్య మెసేజ్ వచ్చింది. ఈ వేడి చల్లారకముందే రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరగడం బి టౌన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ బెదిరింపుల పరంపర మరో స్టార్ హీరో ఇంటికి చేరడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
అసలు విషయంలోకి వెళితే, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి వాట్సాప్ ద్వారా ఒక వాయిస్ నోట్ బెదిరింపు రావడం ఇప్పుడు ముంబైలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత రణవీర్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీని వెనుక కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉండవచ్చని ముంబై క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. దీంతో సౌత్ ముంబైలో ఆయన నివాసం ఉంటున్న బిల్డింగ్ దగ్గర పోలీసులు భారీగా భద్రతను పెంచారు.
అయితే రణవీర్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఈ హై లెవల్ సెక్యూరిటీ వల్ల ఆయన బిల్డింగ్ లో ఉండే మిగతా రెసిడెంట్స్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయుధాలు పట్టుకున్న గార్డులు లాబీలు, జిమ్ ఏరియాల్లో తిరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు భయపడుతున్నారని సొసైటీ మేనేజింగ్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేవలం ఒక హీరో కోసం బిల్డింగ్ మొత్తాన్ని డేంజరస్ వాతావరణంగా మార్చడం ఏంటని వారు లేఖలో ప్రశ్నించారు. ఇది రణవీర్‌కు అటు బయటి నుండి, ఇటు లోపలి నుండి కూడా తలనొప్పిగా మారింది.
పోలీసులు ఈ వాయిస్ నోట్ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై డిజిటల్ విచారణ మొదలుపెట్టారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ మెసేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ల పేర్లను వాడుతూ రణవీర్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఒక్కరేనా లేక వేర్వేరు ముఠాలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయా అనేది ముంబై పోలీసులు తేల్చాల్సి ఉంది.
వరుసగా జరుగుతున్న ఈ బెదిరింపులు బాలీవుడ్ షూటింగ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. బయట లోకేషన్లలో షూటింగ్ చేయాలంటే నిర్మాతలు వణికిపోతున్నారు. స్టార్ హీరోల రెమ్యునరేషన్లు ఒక ఎత్తు అయితే, వారి భద్రత కోసం చేసే ఖర్చు ఇప్పుడు నిర్మాతలకు భారంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ గ్యాంగ్స్‌కు ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి. రణవీర్ విషయంలో జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్‌లో త్వరలోనే కొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.