1900 కోట్లు నటి పిల్లలకు.. నిర్మాత 30వేల కోట్ల ఆస్తి గొడవ!
దిగ్గజ పారిశ్రామికవేత్త, నటుడు, నిర్మాత సంజయ్ కపూర్ ఇంట ఆస్తుల వివాదం రచ్చకెక్కుతోంది.;
దిగ్గజ పారిశ్రామికవేత్త, నటుడు, నిర్మాత సంజయ్ కపూర్ ఇంట ఆస్తుల వివాదం రచ్చకెక్కుతోంది. అతడి మరణంతో ఆస్తికోసం భార్యల బాహాబాహీ పరాకాష్టకు చేరుకుంటోంది. సంజయ్ ప్రస్తుత భార్య, మాజీ భార్యల మధ్య వాగ్వివాదం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇప్పుడు 30,000 కోట్ల ఆస్తికి సంబంధించిన గొడవ కోర్టుల పరిధిలోకి వెళ్లింది. కపూర్ ఆస్తిలో తన పిల్లలకు పెద్ద వాటాను ఆశిస్తున్న అతడి రెండో భార్య కరిష్మాకపూర్, ప్రస్తుత భార్య అయిన ప్రియా సచ్ దేవ్ పై న్యాయపోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ప్రియా సచ్ దేవ్ కపూర్ తనకు కానీ, తన పిల్లలకు కానీ తన దివంగత భర్త సంజయ్ వీలునామా గురించి చెప్పలేదని, ప్రియా సచ్ దేవ్ తప్పుడు వీలునామా సృష్టించి గందరగోళం సృష్టిస్తోందని, ఆమె ప్రవర్తనపై అనుమానాలున్నాయని తన పిటిషన్ లో కరిష్మా కపూర్ ఆరోపించారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ సంస్థానం నుంచి తన ఇద్దరు పిల్లలకు రావాల్సిన వాటాను ఇప్పించాల్సిందిగా, న్యాయపరిహారం తేలే వరకూ ఆస్తుల అమ్మకాలు లేదా బదలాయింపులు లేదా తారుమారు చేయడాల్ని కోర్టు నిషేధించాలని కరిష్మా పిటిషన్ ని సమర్పించింది.
అయితే ఇప్పుడు దీనికి ప్రియా సచ్ దేవ్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ బౌన్స్ బ్యాక్ అయింది. కరిష్మా పిటిషన్ ని ప్రశ్నిస్తూ, ప్రియా సచ్ దేవ్ ప్రతిదాడికి దిగారు. కరిష్మా పిల్లలకు ట్రస్ట్ నుంచి రూ.1,900 కోట్లు వచ్చాయి. వారికి ఇంకా ఏమి కావాలి? అని సంజయ్ కపూర్ భార్య ప్రియా ప్రశ్నించారు. సంజయ్ ఎవరినీ వీధిలో వదిలేయలేదని ప్రియా న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. వీలునామా రిజిస్టర్ అయిందా? అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ప్రియా న్యాయవాది సమాధానమిచ్చారు. వీలునామాను రిజిస్టర్ చేయలేదు. కానీ చెల్లుబాటు కానిది అని తీసివేయలేమని తీర్పు ఉన్నట్టు వాదించారు. ప్రతివాది (కరిష్మా) ఏడుపు అంతా దేనికి? ట్రస్ట్ నుండి రూ.1900 కోట్లు అందుకున్నారు. వారికి ఇంకా ఏమి కావాలి? అని ప్రియా తరపు న్యాయవాది ప్రశ్నించారు.
దివంగత తండ్రి సంజయ్ కపూర్ రాసారు అంటూ పేర్కొన్న వీలునామాను సవాలు చేస్తూ మాజీ భార్య కరిష్మాకపూర్ పిల్లలు సమైరా కపూర్ (20), 15 ఏళ్ల మైనర్ కుమారుడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారించగా పైవిధంగా వాదోపవాదనలు సాగాయి. కోర్టు ప్రియాకు నోటీసు జారీ చేసి ఈ విషయాన్ని అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ప్రతివాది ప్రియా కూడా పిటిషన్ దాఖలు చేయాలని అన్ని చరాస్తులు, స్థిరాస్తుల జాబితాను కోర్టుకు దాఖలు చేయాలని, జూన్ 12 నాటికి ఆస్తులను ప్రకటించాలని న్యాయమూర్తి సూచించారు.
అయితే కోర్టు విచారణలో ప్రియా కపూర్ వాదనలు ఇలా ఉన్నాయి. నేను వితంతువును. అతడి చివరి భార్యను. ఆయన ఆత్మకు శాంతినివ్వండి. కొంత సానుభూతి చూపండి. నాకు 6 సంవత్సరాల బిడ్డ ఉంది. గత 15 సంవత్సరాలుగా కనిపించని వ్యక్తులు ఇప్పుడే ఎందుకు వచ్చారు. అయినా ఆయన వీళ్లందరినీ వీధిలో వదిలేసినట్టు కాదు కదా! అని కూడా వాదించారు. సంజయ్ బతికి ఉండగానే కరిష్మా కపూర్ పిల్లలకు సెటిల్ చేసారని ప్రియా సచ్ దేవ్ వాదించారు. మరోవైపు ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వాలని, తనను రోడ్డుపై వదిలేసారని సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ కూడా కోర్టులో పిటిషన్ వేయగా దానిపైనా విచారణ సాగుతోంది. సంజయ్ కపూర్ మరణించేప్పటికి అతడి ఆస్తులు 10,000 కోట్లు అంటూ ప్రచారం సాగింది. కానీ జూమ్ తన తాజా కథనంలో సంజయ్ కపూర్ కి 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొనడం విస్మయపరుస్తోంది. వేల కోట్ల ఆస్తుల కోసం ఇప్పుడు కుటుంబంలో పెద్ద వివాదాలు తలెత్తాయని అర్థమవుతోంది.