3000 కోట్ల క్ల‌బ్ హీరో 3 కోట్ల ఓపెనింగ్ అయినా తేలేదు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు స్టార్ల ఇమేజ్‌కు.. వారు సోలో హీరోగా సాధించే బాక్సాఫీస్ వసూళ్లకు అస్సలు పొంతన ఉండదు.

Update: 2026-05-19 17:31 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు స్టార్ల ఇమేజ్‌కు.. వారు సోలో హీరోగా సాధించే బాక్సాఫీస్ వసూళ్లకు అస్సలు పొంతన ఉండదు. దానికి తాజా ఉదాహరణే బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించిన తాజా చిత్రం `ఆఖరి సవాల్`. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 3000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన ఒక భారీ ఫ్రాంచైజీ సినిమాలో భాగమైన సంజయ్ దత్.. ఇప్పుడు సోలోగా నటించిన సినిమా కనీస మాత్రంగా కనీసం 3 కోట్ల రూపాయల ఓపెనింగులను రాబట్టడంలో కూడా పూర్తిగా చతికిలబడటం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నటుల ఫీజులను మినహాయించి కేవలం 30 కోట్ల రూపాయల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామా థియేటర్లలో తీవ్ర నిరాశజనక ప్రదర్శనను కనబరుస్తోంది.

అభిజీత్ మోహన్ వరాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆఖరి సవాల్` చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యంత బలహీనమైన ఓపెనింగ్స్‌తో మొద‌లైంది. ఈ సినిమా మొదటి రోజు కేవలం 40 లక్షల రూపాయల వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. ఇక వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం నాటి కీలకమైన `మండే టెస్ట్`లో ఈ చిత్రం మరింతగా పడిపోయింది. మొదటి రోజుతో పోలిస్తే సోమవారం నాటికి దాదాపు 47.5 శాతం కలెక్షన్స్ పడిపోయి.. కేవలం 21 లక్షల రూపాయలకే పరిమితమైంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు రోజులు గడిచినా.. ఈ చిత్రం భారతదేశం వ్యాప్తంగా కేవలం 2.16 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే పెట్టిన 30 కోట్ల పెట్టుబడిలో ఇప్పటివరకు కేవలం 7 శాతం మాత్రమే రికవరీ సాధించడంతో ఈ సినిమా థియేటర్లలో ఎంతకాలం నిలబడుతుందోనని ట్రేడ్ నిపుణులు పెదవి విరుస్తున్నారు.

వాస్తవానికి సంజయ్ దత్ గతంలో `దురంధర్-దురంధర్ 2` వంటి భారీ పాన్-ఇండియా సెన్సేషనల్ ప్రాజెక్ట్స్‌లో నటించి మెప్పించారు. ఈ రెండు సినిమాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 3000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంచలనంగా నిలిచాయి. అంతకుముందు కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1200 కోట్లు కొల్లగొట్టిన `కేజీఎఫ్ 2` చిత్రంలో విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ చూపిన నటన నభూతో నభవిష్యతి. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీలలో కీలక పాత్రలు పోషించిన ఒక సీనియర్ స్టార్ హీరో సోలోగా లీడ్ రోల్ పోషించిన సినిమాకి కనీసం థియేటర్ల రెంట్లు కూడా రాని ఇలాంటి దారుణమైన రిజల్ట్ రావడం చూస్తుంటే సంజయ్ దత్ ఇమేజ్ సోషల్ మీడియాలో నెటిజనుల విమర్శలకు, అపహాస్యానికి గురవుతోంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడానికి కథ ప‌రంగా బలహీనతలతో పాటు థియేటర్ల కొరత కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో దురంధర్ 2, భూత్ బంగ్లా, పతి పత్ని ఔర్ వో దో, కృష్ణావతారం పార్ట్ 1, `రాజా శివాజీ` వంటి భారీ క్రేజ్ ఉన్న చిత్రాలు పోటీలో ఉండటంతో `ఆఖరి సవాల్` చిత్రానికి చాలా పరిమిత సంఖ్యలో స్క్రీన్స్ దక్కాయి. నమాషి చక్రవర్తి, అమిత్ సాధ్... సుదీర్ఘ విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన సమీరా రెడ్డి వంటి నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించినా.. కనీస ప్రమోషన్లు లేకపోవడం.. థియేటర్లలో వేరే పెద్ద సినిమాల పోటీని తట్టుకోలేకపోవడంతో ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఆఖరి సవాల్’ చిత్ర ఫలితం సినిమా ఇండస్ట్రీలో ఒక చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.

ఎంతటి పెద్ద స్టార్ హీరోలైనా సరే వారి వెనుక భారీ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ లేదా క్రేజీ ఫ్రాంచైజీల సపోర్ట్ ఉన్నప్పుడు వచ్చే వందల కోట్ల వసూళ్లు.. వారు ఒంటరిగా చిన్న సినిమాలతో వచ్చినప్పుడు రావు అని స్పష్టమైంది. కేవలం నటుల స్టార్‌డమ్ చూసి కాకుండా.. కంటెంట్‌లో దమ్ము ఉండి సరైన థియేట్రికల్ ప్లానింగ్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారని... లేదంటే ఎంతటి సీనియర్ స్టార్ సినిమానైనా నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారని ఈ చిత్ర కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలకు ఒక గట్టి పాఠాన్ని నేర్పాయి.

Tags:    

Similar News