మ్యాడ్ బాయ్ తో నిహారిక న్యూ కాంబో
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎక్కువగా కొత్త వారితోనే ప్రయోగాలు చేస్తూ మంచి రిజల్ట్ ను అందుకుంటోంది.;
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన కెరీర్ ను డిఫరెంట్ ట్రాక్ లో హైలెట్ చేసుకుంటోంది. కెరీర్ మొదట్లో యాంకరింగ్ అంటూ బుల్లితెరపై కాస్త హడావుడి చేసిన అమ్మడు ఆ తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నటనతో పాటు నిర్మాతగా కూడా ఆమె తన టాలెంట్‌ను నిరూపించుకుంది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎక్కువగా కొత్త వారితోనే ప్రయోగాలు చేస్తూ మంచి రిజల్ట్ ను అందుకుంటోంది. ముద్దపప్పు అవకాయ, హలో వరల్డ్, బెంచ్ లైఫ్, నాన్న కూచి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి వెబ్‌సిరీస్‌లను నిర్మించిన నిహారిక.. 2024లో కమిటీ కుర్రోలు అనే సినిమాతో ఫీచర్ ఫిల్మ్‌లలోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం కొత్తవాళ్లతో, తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యింది. ఈ విజయంతో నిర్మాతగా నిహారికకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు అదే ఉత్సాహంతో మరో సినిమా ప్రకటించింది. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈసారి హీరోగా సంగీత్ శోభన్‌తో కలిసి పని చేయనుంది. సంగీత్ శోభన్ ప్రస్తుతం యూత్‌లో ట్రెండింగ్ స్టార్. మాడ్, మాడ్ స్క్వేర్ సినిమాల్లో అతని నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కానీ అందులో మిగతా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోగా సోలోగా మరో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇక ఇప్పుడు నిహారిక నిర్మాణంలో అతని తొలి సోలో థియేట్రికల్ మూవీ రిలీజ్ కాబోతోంది. వెబ్‌లో అప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ థియేటర్‌లోనూ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మనసా శర్మ దర్శకత్వం వహించనుంది. మనసా శర్మకు ఇది దర్శకురాలిగా తొలి సినిమా అయినా, నిహారికతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్‌సిరీస్‌కు ఆమె రచయితగా పని చేశారు.
అదే సిరీస్‌లో సంగీత్ హీరోగా నటించారు. ఇప్పుడు ఆ టీమ్ మళ్లీ కలిసి వెండితెరపై మెరిపించబోతోంది. దీంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి మనసా శర్మతో పాటు మహేష్ ఉప్పల స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇదే సినిమాతో మరోసారి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తూ నిహారిక మరో ప్రయోగం చేస్తోంది. అలాగే యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఫన్, ఫీల్ గుడ్ కథగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని టాక్.