సూప‌ర్‌స్టార్‌తో పెళ్లి క్యాన్సిల్, ఆపై క్రికెట‌ర్‌తో పెళ్లి.. చివ‌రికి ఒంట‌రిగా..!

సినీ ప్రపంచంలో కొందరి జీవితాలు వెండితెరపై కంటే నిజజీవితంలోనే ఎక్కువ మలుపులతో, కథనాలను తలపించేలా సాగుతుంటాయి. అలాంటి వారిలో ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ ఒకరు.

Update: 2026-06-16 12:30 GMT

సినీ ప్రపంచంలో కొందరి జీవితాలు వెండితెరపై కంటే నిజజీవితంలోనే ఎక్కువ మలుపులతో, కథనాలను తలపించేలా సాగుతుంటాయి. అలాంటి వారిలో ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సంగీతా బిజ్లానీ ఒకరు. ఎనభై, తొంభైల కాలంలో అత్యంత గ్లామరస్ తారలలో ఒకరిగా వెలిగిన ఈ భామ‌ జీవితం కేవలం సినిమా విజయాలకే పరిమితం కాలేదు. ఒక సూపర్ స్టార్‌కు భార్య కాబోయి చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడం... ఆ తర్వాత ఒక క్రికెట్ దిగ్గజాన్ని పెళ్లాడటం.. ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఒంటరిగా, స్వేచ్ఛగా జీవించడం వంటి ఎన్నో ఆసక్తికరమైన అధ్యాయాలు ఈ న‌టి జీవితంలో ఉన్నాయి.



 


ముంబైలో 9 జూలై 1960న జన్మించిన సంగీతా బిజ్లానీ.. టీనేజర్‌గా ఉన్నప్పుడే ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. తనదైన అందం, హొయలుతో ఆ కాలంలోనే టాప్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే త‌న‌ కెరీర్‌లో మైలురాయి ఘటన 1980లో జరిగింది. ఆ ఏడాది `మిస్ ఇండియా` కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ప్రతిష్టాత్మక `మిస్ యూనివర్స్`పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ సెమీఫైనల్స్‌కు చేరుకోలేకపోయినా సంగీత‌ ప్రదర్శించిన సాంప్రదాయ దుస్తుల (నేషనల్ కాస్ట్యూమ్) విభాగంలో ప్రత్యేక గుర్తింపును, ప్రశంసలను సొంతం చేసుకున్నారు.

మోడల్ కం న‌టిగా కెరీర్ ప‌రంగా సంగీత బిజ్లానీ రాణించారు. ఆదిత్య పంచోలి స‌ర‌స‌న ఖ‌తిల్(1988) అనే చిత్రంతో కెరీర్ ని ప్రారంభించిన సంగీత‌.. త్రిదేవ్, హ‌త్య‌ర్ వంటి చిత్రాల‌తో న‌టిగా త‌న‌దైన ముద్ర వేసారు. అదే ఊపులో ఓ అర‌డ‌జ‌ను చిత్రాలలో న‌టించినా కానీ..అవేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ విజయాలను అందుకోలేకపోయాయి. న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కినా కానీ, ఎందుక‌నో ఈ రంగంలో నిల‌దొక్కుకోలేక‌పోయింది.

సినిమాల కంటే సంగీత వ్యక్తిగత జీవితమే అప్పట్లో మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమైంది. 1980ల మధ్యకాలంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. దాదాపు పదేళ్ల పాటు సాగిన వీరి బంధం 1994లో పెళ్లి పీటల వరకు వచ్చింది. పెళ్లి పత్రికలు కూడా ముద్రించారు కానీ అనూహ్యంగా వివాహానికి కొద్దిరోజుల ముందే వీరి పెళ్లి రద్దయింది. సల్మాన్ ఖాన్ తనను మోసం చేయడమే ఇందుకు కారణమని చెబుతుంటారు. అయితే కాలక్రమేణా వీరి మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలు సమసిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరి పుట్టినరోజు వేడుకలకు, కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

సల్మాన్‌తో విడిపోయిన తర్వాత సంగీత భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో ప్రేమలో పడ్డారు. అజారుద్దీన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత 1996లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. బాలీవుడ్, క్రికెట్ రంగాల కలయికగా జరిగిన ఈ పెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబానికే పరిమితమయ్యారు. దాదాపు 14 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఆ తర్వాత విభేదాలు రావడంతో 2010లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఈ వెట‌ర‌న్ న‌టి రెండో పెళ్లి చేసుకోకుండా... గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం 65 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ స్వీయ నియంత్రణతో కూడిన స్వతంత్ర జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు.

Tags:    

Similar News