సందీప్ రెడ్డి వంగ బిజినెస్ స్ట్రాటజీ!

టాలీవుడ్ సంచ‌ల‌నం సందీప్ రెడ్డి వంగా ప‌నిత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-04-18 19:30 GMT

టాలీవుడ్ సంచ‌ల‌నం సందీప్ రెడ్డి వంగా ప‌నిత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన శైలి, ఇమేజ్ ను క‌లిగిన ద‌ర్శ‌కుడు. `అర్జున్ రెడ్డి`, `యానిమ‌ల్` అనే రెండు విజ‌యాల‌తోనే తానేంటో ఇండియాకు రుచి చూపించిన గ్రేట్ మేక‌ర్. పాత క‌థ‌లనే త‌న‌దైన ట్రీట్ మెంట్ తో ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచ‌డంలో తానో స్పెష‌లిస్ట్ గా ముద్ర వేసుకున్నాడు. సిస‌లైన న్యూ ఏజ్ మేక‌ర్ అంటే ఎలా ఉంటాడో చూపించాడు. అందుకే డైరెక్ట‌ర్లు అవ్వాల‌నుకుంటోన్న ప్ర‌స్తుత త‌ర‌మంతా సందీప్ వ‌ద్ద మాత్ర‌మే శిష్య‌రికం చేయ‌మ‌ని రాంగోపాల్ వ‌ర్మ గంటా ప‌థంగా చెబుతున్నారు.

అలాగే సందీప్ బిజినెస్ స్ట్రాట‌జీ కూడా భిన్నంగా ఉంటుంది. తొలి నుంచి సొంత నిర్మాణంలోనే చేప‌డుతున్నాడు. త‌న బ్రాండ్ నే పెట్టుబ‌డిగా పెడుతూ సినిమాలో వాటా సైతం అందుకుంటున్నాడు. బ‌య‌ట సంస్థ‌ల‌తో క‌లిసి సొంత బ్యాన‌ర్లో సినిమాలు నిర్మిస్తూ రెండు ర‌కాలుగా ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. తాజాగా సినిమా వ్యాపార పరంగా సందీప్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశ మవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమాల ప్రమోషన్స్ గమనిస్తే ఓ విషయం అర్ద‌మ‌వుతంది. సినిమాపై వచ్చే విమర్శలను కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు.

ఆ నెగిటివిటీని కూడా సినిమా పబ్లిసిటీకి అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన స్పెష‌లిస్ట్. తన కంటెంట్‌పై ఉన్న నమ్మకమే అంత గట్టిగా మాట్లాడేలా చేస్తుందన్న‌ది కాద‌న‌లేని నిజం. ఇది పరోక్షంగా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. తద్వారా బిజినెస్ డీల్స్ ప‌రంగా డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు షూటింగ్ మొదలవ్వకముందే ఓటిటి , శాటిలైట్ హక్కులను విక్రయించడం క‌నిపిస్తుంది. కానీ సందీప్ దీనికి భిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా `స్పిరిట్` చిత్రం విషయంలో ఆయ‌న ఓ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

కంటెంట్ పూర్తిగా సిద్ధమైన అనంత‌రం సినిమా అవుట్‌పుట్ చూసుకున్న‌ తర్వాతే రేట్లను నిర్ణయించాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడుట‌. సినిమా రేంజ్‌ను బట్టి మెరుగైన డీల్స్ కుదుర్చుకోవచ్చనేది అత‌డి ఆలోచ‌న కావొచ్చు.

తను అనుకున్న కంటెంట్‌ను ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించడమే కాకుండా ప్రీ-రిలీజ్ డీల్స్ విషయంలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారుట‌. బయ్యర్లతో చర్చల సమయంలో సందీప్ నేరుగా పాల్గొని సినిమాపై న‌మ్మ‌కాన్ని పెంచ‌డంలోనూ స్పెష‌లిస్ట్ అట‌.

తొంద‌రప‌డి తక్కువ ధరలకు డీల్స్ ఓకే చేసే కన్నా? సరైన సమయం కోసం వేచి చూడటం ఆయన బిజినెస్ స్ట్రాటజీలో ఓ భాగం అటున్నారు. బిజినెస్ డీల్స్ విష‌యంలో మొండిగా వ్య‌వ‌హ‌రించే ఓటీటీల‌ను, శాటైలైంట్ సంస్థ‌ల‌ను సైతం త‌న దారికి తెచ్చుకుని డీల్స్ చేయ‌డం అత‌డికే చెల్లింద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. దీన్ని బ‌ట్టి సందీప్ రెడ్డి వంగ కేవలం దర్శకుడిగానే కాదు. పక్కా బిజినెస్ మ్యాన్‌లా ఆలోచిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News