ఖాన్‌లు ఈగోలు వదిలి సందీప్ వంగాతో పని చేస్తారా?
అయితే ఈ రెండు భారీ విజయాల సందర్భంలోనూ బాలీవుడ్ అగ్ర హీరోలైన ఖాన్‌ల త్రయం (షాహారుఖ్, సల్మాన్, అమీర్) నుంచి పెద్దగా స్పందన రాలేదు.
బాలీవుడ్ లో సౌత్ దర్శకుల హవా అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ప్రియదర్శన్, మణిరత్నం, మురుగదాస్, లింగుస్వామి వంటి డజనుకు పైగా దక్షిణాది దర్శకులు హిందీ హీరోలతో సినిమాలు చేశారు. అయితే వీరెవరికీ లేని క్రేజ్ ప్రత్యేకమైన గుర్తింపు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా సొంతం చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన సందీప్ ఇప్పటికే అక్కడి హీరోలు షాహిద్ కపూర్, రణబీర్ కపూర్‌ల ఫేట్‌ని పూర్తిగా మార్చేశారు. షాహిద్ కెరీర్‌లో తొలిసారి వంద కోట్ల క్లబ్‌ను, రణబీర్‌కు ఏకంగా 500 కోట్ల క్లబ్‌ను అందించి తన సత్తా చాటారు.
అయితే ఈ రెండు భారీ విజయాల సందర్భంలోనూ బాలీవుడ్ అగ్ర హీరోలైన ఖాన్‌ల త్రయం (షాహారుఖ్, సల్మాన్, అమీర్) నుంచి పెద్దగా స్పందన రాలేదు. పైగా సందీప్ వంగా సినిమాల్లో హింస, రక్తపాతం, స్త్రీవిద్వేషం ఎక్కువగా ఉంటాయంటూ ఒక వర్గం బాలీవుడ్ మేధావులు, విమర్శకులు ఆయనపై విమర్శలు గుప్పించడం కొనసాగించారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ లాంటి వారే సందీప్ శైలిని తప్పుపట్టి, ఆ తర్వాత ఆయన మేకింగ్ ప్రతిభను చూసి ప్రశంసించక తప్పలేదు. సాధారణంగా దక్షిణాది అగ్ర దర్శకులతో పనిచేయడానికి ఖాన్‌లకు ఆసక్తి ఉన్నా.. సందీప్ విషయంలో వారి ఈగోలు అడ్డుపడుతున్నాయా అనే చర్చ నడుస్తోంది.
బాలీవుడ్‌లో ప్రస్తుతం వంగా హవా స్పష్టంగా కనిపిస్తున్నా ఖాన్‌ల త్రయం మాత్రం ఇప్పటివరకు మౌనంగానే ఉండిపోయింది. హిందీకి చెందిన పలువురు అగ్ర దర్శకులు సరైన విజయాలను అందుకోవడంలో విఫలమవుతున్న తరుణంలో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ టాలీవుడ్ సెన్సేషన్‌తో పనిచేసేందుకు వారు ఆసక్తిగా ఉన్నారా లేరా? అన్నదానిపై ఇంకా సరైన స్పష్ఠత లేదు. సందీప్ వంగా వంటి బలమైన, వైవిధ్యమైన ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్లు రాసే దర్శకుడితో సినిమాలు చేస్తే ఖాన్ లు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి పూర్తిగా కొత్త పంథాలో నటించాల్సి ఉంటుంది.
అయితే దానికోసం సల్మాన్ లాంటి హీరో మైండ్ సెట్ చేసుకున్నాడని కూడా గుసగుస వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్ - సందీప్ వంగా కలయికలో ఓ క్రేజీ చిత్రం రాబోతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సందీప్ మార్క్ ఇంటెన్స్, యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ మాస్ ఇమేజ్‌కు సందీప్ వంగా టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
మరోవైపు సందీప్ వంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో `స్పిరిట్` చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తవ్వగానే రణబీర్ కపూర్‌తో `యానిమల్ పార్క్` సీక్వెల్‌ను పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు టాలీవుడ్ టాప్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారితో పనిచేసేందుకు కూడా ఆయన ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖాన్‌ల త్రయం తమ ఈగోలను పక్కనపెట్టి సందీప్‌తో సినిమాకు సిద్ధపడినా.. అతడి కాల్షీట్లు దొరకడం అంత సులువు కాదు. సల్మాన్ తో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా? అనేదానికి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.