బేబిబంప్ మ్యాటర్: సమంత లాగే మీడియాకు లీకిచ్చిన హీరోయిన్లు
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అభిమానుల్లో ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాలైతే సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతుంటాయి.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అభిమానుల్లో ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాలైతే సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానులకు తీపి కబురు అందించారు. తన సినిమా `మా ఇంటి బంగారం` విజయోత్సవ సభలో సమంత స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మాతృత్వ సెలవుల కోసం సినిమాలకు కొంతకాలం బ్రేక్ తీసుకోనున్నట్లు సమంత స్పష్టం చేసారు.
గత కొన్ని రోజులుగా సమంత గర్భవతి అనే వార్తలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేశాయి. `మా ఇంటి బంగారం` సక్సెస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అందులో సమంత `బేబీ బంప్` స్పష్టంగా కనిపిస్తోందంటూ అభిమానులు నెట్టింట చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మీడియా ముందు మాట్లాడిన సమంత.. ``నా ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా `మా ఇంటి బంగారం` తర్వాత నేను చిన్న బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో నా అభిమానుల ముందుకు వస్తాను`` అని నోరు జారడంతో ప్రెగ్నెన్సీ వార్త లీక్ అయి... ఆ తర్వాత అది కాస్తా అధికారికంగా కన్‌ఫర్మ్ అయిపోయింది.
సమంత తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని సద్గురు ఈశా ఫౌండేషన్‌లో అత్యంత ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి సూపర్ హిట్ వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్ 2` కోసం పనిచేశారు. ఆ తర్వాత వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దాగుడుమూతల ప్రేమాయణంపై మొదట రూమర్స్ వచ్చాయి. ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన `మా ఇంటి బంగారం` సినిమాకు సమంత నిర్మాత కాగా, రాజ్ రచనా సహకారం అందించారు.
ఇంకా చాలామంది ఉన్నారు:
సమంత తరహాలోనే గతంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోయిన్లు కూడా తమ ప్రెగ్నెన్సీ వార్తలను అధికారికంగా ప్రకటించడానికంటే ముందే మీడియా కంటికి చిక్కారు. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ తన రెండో ప్రెగ్నెన్సీ సమయంలో లూజ్ దుస్తులు ధరించి మీడియా కంట పడటం.. ఆ తర్వాత ఒక యాడ్ షూట్ సెట్‌లో బేబీ బంప్ లీక్ అవ్వడంతో వార్త ముందే బయటకు వచ్చేసింది. నటి అలియా భట్ సైతం తన పెళ్లయిన కొన్ని వారాలకే షూటింగ్ స్పాట్లలో కనిపించిన విధానం.. లూజ్ ఫిట్టింగ్ బట్టల వల్ల నెటిజన్లు ప్రెగ్నెన్సీని ముందే పసిగట్టేశారు.
సౌత్ ఇండస్ట్రీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా హీరోయిన్లు పొరపాటున నోరు జారడం లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రెగ్నెన్సీ లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. గతంలో నటి ప్రణీత సుభాష్ తన ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే భర్తతో కలిసి ఉన్న కొన్ని ఫోటోల్లో బేబీ బంప్ కనిపించడంతో అభిమానులు గుర్తుపట్టారు. అలాగే మరికొందరు నటీమణులు ఇంటర్వ్యూలలో `భవిష్యత్తు ప్లానింగ్స్` గురించి మాట్లాడుతూ.. కొన్ని నెలల పాటు లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నానని పొరపాటున హింట్ ఇచ్చేసి మీడియాకు దొరికిపోయారు. ఈ విధంగా సమంత లాగే సౌత్, నార్త్ అనే తేడా లేకుండా చాలా మంది హీరోయిన్ల ప్రెగ్నెన్సీ మ్యాటర్స్ వారు అనౌన్స్ చేయకముందే లీకై వైరల్ అయ్యాయి.