స్టార్ హీరోయిన్లు తప్ప మిగిలిన వారికి భద్రత ఏది?
సినిమా పరిశ్రమలో మహిళా నటులకు ఉన్న పరిస్థితులపై మాట్లాడిన రాధికా ఆప్టే అక్కడ కేవలం అగ్ర నటీమణులకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.
పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు, ఓటీటీ ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భామ తాజాగా బాలీవుడ్ పరిశ్రమలో మహిళల స్థితిగతులు.. అవకాశాల విషయంలో సాగుతున్న వివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్న కొద్దిమంది తప్ప మిగిలిన నటీనటులకు ఎలాంటి భద్రత .. స్థిరత్వం లేదని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలోనూ చర్చనీయాంశంగా మారాయి.
సినిమా పరిశ్రమలో మహిళా నటులకు ఉన్న పరిస్థితులపై మాట్లాడిన రాధికా ఆప్టే అక్కడ కేవలం అగ్ర నటీమణులకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. `బాలీవుడ్లో అలియా భట్, దీపికా పదుకొణె వంటి కొద్దిమంది టాప్ హీరోయిన్లు మాత్రమే సురక్షితమైన స్థానంలో ఉన్నారు. వారు ఎలాంటి సినిమా ఎంచుకున్నా? వారి కెరీర్‌కు .. మార్కెట్‌కు వచ్చే ముప్పేమీ ఉండదు. వారి ఇమేజ్.. వ్యాపార కోణం వారిని సురక్షితంగా ఉంచుతాయి` అని రాధిక అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు.
అగ్ర నటీమణుల మినహా మిగిలిన ప్రతిభావంతులైన నటీనటులకు ఇండస్ట్రీలో ఎలాంటి భద్రత లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతటి ప్రతిభ ఉన్నా? సోషల్ మీడియా ఫాలోయింగ్ .. బాక్సాఫీస్ లెక్కల ఆధారంగానే అవకాశాలు నిర్ణయించబడుతున్నాయని ఆరోపించారు. నిర్మాతలు .. దర్శకులు కేవలం వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నారని.. నటనకు ప్రాధాన్యత ఇచ్చే కథలు వచ్చినా? వాటికి సరైన బడ్జెట్ లేదా ప్రమోషన్ లభించడం లేదని రాధిక ఆవేదన చెందారు.
సినీ రంగాన్ని వ్యాపార వ్యవస్థగా మాత్రమే చూస్తున్నారే తప్ప కళకు ఇచ్చే గౌరవం క్రమంగా తగ్గిపోతోందని రాధిక విమర్శించారు. అవకాశాలు ఇచ్చే విషయంలో నటీనటుల వయస్సు, గ్లామర్, మార్కెట్ క్రేజ్ వంటి అంశాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో నటనపై ఆధారపడి జీవించే అనేకమంది నటీనటులు ప్రతిరోజూ అభద్రతా భావంతో బతకాల్సి వస్తోందని.. పరిశ్రమలో నిలదొక్కుకోవడం రోజురోజుకూ సవాలుగా మారుతోందన్నారు.
ఒకప్పుడు ఓటీటీ వేదికల నటనకు.. కొత్త కథలకు గొప్ప అవకాశాలు ఇచ్చేవని కానీ ఇప్పుడు అక్కడ కూడా పెద్ద సిని మాల ట్రెండ్.. స్టార్ వ్యాల్యూనే ఏలుతోందని రాధిక వ్యాఖ్యానించారు. ఇండిపెండెంట్ సినిమాలు..వైవిధ్యమైన పాత్రలకు ఓటీటీల్లో కూడా పూర్వపు స్థానం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పు రాకపోతే నిజమైన నటులు పరిశ్రమకు దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నిజాయితీగా నిర్మొహమాటంగా మాట్లాడే రాధికా ఆప్టే చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ..విశ్లేషకులు రాధిక వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న నికార్సైన పరిస్థితులకు ఇది అద్దం పడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా? రాధికా చేసిన ఓపెన్ కామెంట్స్ మరోసారి పరిశ్రమలో అసమానతలపై సరికొత్త చర్చకు తెర తీసినట్లు అయింది.