ఆ రెండేళ్లు నచ్చింది తినలేక నరకం అనుభవించాను.. సమంత ఎమోషనల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న మయోసైటిస్ ఆరోగ్య సమస్యల గురించి మనందరికీ తెలిసిందే.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న మయోసైటిస్ ఆరోగ్య సమస్యల గురించి మనందరికీ తెలిసిందే. ఆ కష్ట కాలం నుండి పూర్తిగా కోలుకున్న సమంత ప్రస్తుతం మళ్లీ నటిగా కెరీర్‌లో బిజీ అయిపోయారు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితం ఆనందంగా సాగుతుండగా..మరోవైపు సామ్ ప్రధాన పాత్రలో నటించి.. నిర్మించిన `మా ఇంటి బంగారం` చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో సమంత తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మయోసైటిస్ వల్ల తాను పడ్డ కష్టాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మయోసైటిస్ బారిన పడిన ఆ రెండేళ్ల కాలాన్ని సమంత ఒక నరకంగా అభివర్ణించారు. ఆ సమయంలో ఆహార నియమాలు ఎంత కఠినంగా ఉండేవో చెబుతూ.. నచ్చిన ఆహారం తిందామన్నా ఒంటికి పడేది కాదు. ఆ సమయంలో నన్ను చూసిన చాలా మంది `డైట్ చేస్తున్నావా? ఎందుకు అలా బరువు తగ్గిపోతున్నావ్?` అని అడిగేవారు. కానీ నా వ్యక్తిగత జీవితంలో, నా ఆరోగ్య విషయంలో ఏం జరుగుతుందో అప్పట్లో ఎవరికీ తెలియదు. నేను కావాలని బరువు తగ్గలేదు, అనారోగ్యం వల్ల అలా అయిపోయాను. తినాలని ఉన్నా తినలేక ఆ రెండేళ్లు నరకం అనుభవించాను.. అంటూ సమంత ఆనాటి కష్టాలను ఓపెన్‌గా షేర్ చేసారు. అయితే ఇప్పుడు ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని..నచ్చిన ఫుడ్ తింటున్నానని... కానీ దేనినైనా అతిగా తినకుండా జాగ్రత్త పడుతున్నానని తెలిపారు.
అనారోగ్య సమస్యలను జయించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమంతకు, తాజా చిత్రం `మా ఇంటి బంగారం` కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారింది. పెళ్లి తర్వాత సామ్ నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా మారి సొంత బ్యానర్‌పై నిర్మించిన మొదటి ప్రయత్నమే ఇది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ సాధించడంతో సమంత ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. నటిగా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించడమే కాకుండా.. ప్రొడ్యూసర్‌గా కూడా తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకోవడంపై ట్రేడ్ వర్గాల సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. `మా ఇంటి బంగారం`పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, హృదయానికి హత్తుకునే డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. మధ్యతరగతి ఫ్యామిలీలో బంధాలు అనుబంధాలు బాధ్యతల చుట్టూ తిరిగే కథాంశమిది. ముఖ్యంగా ఒక సాధారణ గృహిణి తన కుటుంబం కోసం.. తన వారి ఆనందం కోసం పడే తపనను... ఆ క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లను దర్శకుడు అత్యంత సహజంగా... ప్రతి ఒక్కరినీ కదిలించేలా వెండితెరపై ఆవిష్కరించారు. సమంత తన అద్భుతమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోయగా... మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
ఒకవైపు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య... మరోవైపు కెరీర్‌లో సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన సమంత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. వ్యక్తిగత జీవితంలో రాజ్ నిడిమోరుతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతూ... వృత్తిపరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్.. గతాన్ని మర్చిపోయి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కష్టాల తర్వాత వచ్చే విజయమే ఎంతో మధురంగా ఉంటుందని సమంత ప్రస్తుత లైఫ్ స్టైల్ చూస్తే అర్థమవుతోంది.