హీరోకి కాకుండా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోల దృష్టి గత కొంత కాలంగా సౌత్‌ దర్శకుల మీద పడ్డ విషయం తెల్సిందే.;

Update: 2026-04-01 07:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోల దృష్టి గత కొంత కాలంగా సౌత్‌ దర్శకుల మీద పడ్డ విషయం తెల్సిందే. ఇప్పటికే చాలా మంది హీరోలు సౌత్‌ దర్శకులతో సినిమాలు చేశారు. అందులో కొన్ని బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటే, కొన్ని డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. సల్మాన్‌ ఖాన్‌ ఇంతకు ముందే సౌత్‌ దర్శకుడు మురుగదాస్‌తో సినిమా చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పరచినా వెంటనే మరో సౌత్‌ దర్శకుడు అయిన వంశీ పైడిపల్లితో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. సల్మాన్‌ ఖాన్‌, వంశీ పైడిపల్లి కాంబో మూవీని దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడనే విషయం తెల్సిందే. ఈ సినిమాకు సల్మాన్‌ ఖాన్‌ పారితోషికం తీసుకోకుండా, భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడట. దాంతో ఆయన పారితోషికం బదులుగా ఆయన మార్కెట్‌ షేర్‌ లో వాటాను అందుకోబోతున్నాడు. సల్మాన్‌ పారితోషికం లేకున్నా ఇతర నటీనటుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

సల్మాన్‌ ఖాన్‌ తో వంశీ పైడిపల్లి సినిమా...

వంశీ పైడిపల్లి ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసేందుకు ఏళ్లకు ఏళ్లు గ్యాప్‌ తీసుకుంటాడు. అయితే సినిమా కన్ఫర్మ్‌ అయ్యి మేకింగ్‌ మొదలు పెడితే ఏడాది లోపే ఫైనల్‌ కాపీ రెడీ చేస్తాడు అనే పేరు ఉంది. అందుకే వంశీ పైడిపల్లితో సినిమా కమర్షియల్‌గా ఎక్కువ నష్టాన్ని మిగల్చదు అని, మినిమం ఆడినా నిర్మాతలకు డబ్బులు వస్తాయి అనేది టాక్‌. వంశీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే పట్టాలెక్కబోతున్న ఈ సినిమా కోసం స్టార్‌ హీరోయిన్‌ నయనతారను ఎంపిక చేయడం జరిగిందట. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ తో పోటీ పడి మరీ నయనతార పారితోషికం డిమాండ్‌ చేస్తుంది. ఆమె పారితోషికం విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి. అయినా కూడా తన కథకి సరిగ్గా సెట్‌ అవుతుంది అనే ఉద్దేశంతో ఆమెను రూ.10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్‌ చేసి తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్‌గా నయనతార...

నయనతార పారితోషికం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ అనీల్‌ కపూర్‌ను ఈ సినిమా కోసం వంశీ ఎంపిక చేయడం, ఆయన్ను సంప్రదించడం, ఆయనకు కథ చెప్పి ఒప్పించి, అగ్రిమెంట్‌ చేసుకోవడం జరిగిందని అంటున్నారు. అనీల్‌ కపూర్‌ చాలా సీనియర్‌ అయినప్పటికీ ఇప్పటికీ ఆయన పారితోషికం ఆకాశంలో ఉంటుందని బాలీవుడ్‌లో టాక్‌ ఉంది. ఆయనకు ఉన్న క్రేజ్‌ తో పాతిక కోట్లకు పైగా డిమాండ్‌ చేసినా ఆశ్చర్యం లేదు. అయినా కూడా వంశీ ఆయన్ను కాస్ట్‌ చేశాడంటే ఆయన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోలీవుడ్‌ స్టార్‌ అరవింద్‌ స్వామి సైతం ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి ఆయనను సంప్రదించాడా లేదా అనే విషయంలో మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన ఈ సినిమాలో ఉంటే నిండుదనం ఉంటుందని అంటున్నారు.

దిల్‌ రాజు బ్యానర్‌లో సల్మాన్‌ ఖాన్‌...

ఒకప్పటి ఫేమస్ హీరో అయిన అరవంద్‌ స్వామి మధ్యలో కాస్త డల్‌ అయినా ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పారితోషికం విషయంలో స్టార్స్‌తో పోటీ పడుతున్నాడు అనే టాక్‌ ఉంది. కనుక ఆయన పారితోషికం సైతం భారీగా ఉంటుంది. ఇక ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల పారితోషికం విషయంలోనూ భారీతనం కనిపిస్తోందని అంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ పారితోషికం లేక పోయినా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం మొత్తం లెక్క తీస్తే రూ.100 కోట్ల వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకింగ్‌కు కచ్చితంగా రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని ఇన్‌సైడ్‌ టాక్‌. దీంతో రాజు గారితో వంశీ పైడిపల్లి చాలా పెద్ద ప్రాజెక్ట్‌ను మోపిస్తున్నాడు అని టాక్‌ వినిపిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌కి ప్రస్తుత క్రేజ్‌ నేపథ్యంలో భారీ బడ్జెట్‌ అంటే ఆలోచించాలంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. సల్మాన్‌ గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా దిల్‌ రాజుతో వంశీ పైడిపల్లి ఈ స్థాయిలో ఖర్చు చేయిస్తున్నాడంటే ఆయనకు తన స్క్రిప్ట్‌ పై అంతటి నమ్మకం ఉందని అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News