సూపర్ హీరో విన్యాసాలు: హృతిక్ తర్వాత ఈ హీరో నిరూపించ‌గ‌లడా?

బాలీవుడ్ వెండితెరపై సూపర్ హీరో అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే మొదటి పేరు హృతిక్ రోషన్. `క్రిష్` ఫ్రాంచైజీతో ఆయన సృష్టించిన ప్రభంజనం సామాన్యమైనది కాదు.;

Update: 2026-05-02 07:26 GMT

బాలీవుడ్ వెండితెరపై సూపర్ హీరో అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే మొదటి పేరు హృతిక్ రోషన్. `క్రిష్` ఫ్రాంచైజీతో ఆయన సృష్టించిన ప్రభంజనం సామాన్యమైనది కాదు. అద్భుతమైన యాక్షన్ విన్యాసాలు.. కండలు తిరిగిన దేహంతో హృతిక్ ఒక నిజమైన సూపర్ హీరోలా తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను మైమరపించారు. కేవలం `క్రిష్` మాత్రమే కాకుండా, `ధూమ్ 2` వంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమాల్లో ఆయన చేసిన స్టంట్స్, స్టైలిష్ అప్పియరెన్స్ ఒక సూపర్ హీరో స్థాయి ఇమేజ్‌ను ఆయనకు కట్టబెట్టాయి. ఇప్పటివరకు హిందీ చిత్రసీమలో ఈ తరహా పాత్రలకు హృతిక్ మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

బాలీవుడ్ ఏలుతున్న ఖాన్ త్రయంలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి అగ్ర నటులు ఉన్నా.. వారు పూర్తిస్థాయి సూపర్ హీరో పాత్రలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గతంలో షారూఖ్ ఖాన్ `రా-వన్` చిత్రంతో సోషియో ఫాంటసీ ఫిక్షన్ జాన‌ర్‌ను ప్రయత్నించినా అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు సల్మాన్ ఖాన్ `టైగర్` సిరీస్ చిత్రాల్లో లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సన్నివేశాలతో అలరించినా.. అసాధారణ శక్తులు కలిగిన ఫాంటసీ సూపర్ హీరో పాత్రను మాత్రం ఇప్పటివరకు పోషించలేదు. దీంతో సల్మాన్ అభిమానులు ఆయ‌న‌ను అటువంటి పాత్రలో చూడాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు.

దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తర్వాత సల్మాన్ ఖాన్‌కు ఇప్పుడు ఒక అరుదైన అవకాశం దక్కింది. తన కెరీర్ ప్రయాణంలో మొదటిసారి సల్మాన్ ఒక సూపర్ హీరోగా నటించబోతున్నారు. అసాధారణ శక్తులతో అద్భుతాలు చేసే వీరుడిగా స‌ల్మాన్ వెండితెరపై విన్యాసాలు చేయనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... సల్మాన్‌తో సన్నిహితంగా ఉండే ఎంతోమంది దర్శకులకు దక్కని ఈ గొప్ప అవకాశాన్ని తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే దక్కించుకున్నారు. `ఫర్జీ` సిరీస్‌తో షాహిద్ కపూర్‌కు సరికొత్త మేకోవర్ ఇచ్చిన ఈ ద్వయం.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ను ఒక ప్రయోగాత్మక సూపర్ హీరో పాత్రలో ఆవిష్కరించబోతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నా.. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. రాజ్ అండ్ డీకే గత ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుంటే.. సల్మాన్ లాంటి మాస్ హీరోను సూపర్‌హీరోగా చూపించే క్రమంలో వారు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్థమవుతోంది. సల్మాన్ మార్కెట్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ హంగులతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

`క్రిష్` ఫ్రాంచైజీలో హృతిక్ రోషన్ చేసిన అద్భుత విన్యాసాలను ఆస్వాధించిన ప్రేక్షకులకు రాజ్ అండ్ డీకే అంతకు మించిన విజువల్ వండర్‌ను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌ను ఒక సూపర్ హీరోగా సరైన పంథాలో ఆవిష్కరించడం దర్శకులకు ఒక సవాల్ లాంటిది. మరి హృతిక్ రోషన్ తర్వాత బాలీవుడ్‌లో అంతటి స్థాయి సూపర్ హీరో వేవ్‌ను సల్మాన్ ఖాన్ క్రియేట్ చేయగలరా? ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News