పఠాన్‌ల నైజం..చేసిన సాయాన్ని చెప్పుకోరు!
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమ్జద్ ఖాన్ మరణం తర్వాత ఆయన కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి ఆయన కుమారుడు షాదాబ్ ఖాన్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమ్జద్ ఖాన్ మరణం తర్వాత ఆయన కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి ఆయన కుమారుడు షాదాబ్ ఖాన్ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తన తండ్రి అంత్యక్రి యల సమయంలో రచయిత సలీం ఖాన్ (సల్మాన్ ఖాన్ తండ్రి) చూపిన ఉదారతను షాదాబ్ గుర్తు చేసుకున్నారు. అమ్జద్ ఖాన్ అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ కుటుంబం మానసిక వేదనలో ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ సమయంలో సలీం ఖాన్ ఎవరికీ తెలియకుండా చేసిన సాయం గురించి షాదాబ్ వివరించారు.
అమ్జద్ ఖాన్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆ ఖర్చుల గురించి మాట్లాడటానికి ఎవరూ సాహసించలేదు. అయితే సలీం ఖాన్ మౌనంగా వెళ్లి అంత్యక్రియలకు సంబంధించిన ప్రతి పైసాను తానే చెల్లించేశారు. `పఠాన్‌ల నైజం అది. వారు చేసిన సాయాన్ని చెప్పుకోరు` అంటూ సలీం ఖాన్ ప్రవర్తనను షాదాబ్ కొనియాడారు. డబ్బు ఇవ్వడమే కాకుండా క్లిష్ట సమయంలో పెద్ద దిక్కుగా నిలబడి తమను ఓదార్చారని షాదాబ్ ఎమోషనల్ అయ్యారు. అమ్జద్ ఖాన్ - సలీం ఖాన్ మధ్య అనుబంధం `షోలే` సినిమా నాటి నుంచే ఎంతో గాఢంగా ఉంది.
`గబ్బర్ సింగ్` పాత్ర కోసం అమ్జద్‌ను ఎంపిక చేయడంలో సలీం-జావేద్ ద్వయం కీలక పాత్ర పోషించింది. ఆ వృత్తిపరమైన సంబంధం కాలక్రమేణా గొప్ప కుటుంబ అనుబంధంగా మారింది. అందుకే తన స్నేహితుడు ఇక లేడనే వార్త వినగానే సలీం ఖాన్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు.
గ్లామర్ ప్రపంచంలో చాలామంది తాము చేసే చిన్న సాయాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటుంటారు. కానీ సలీం ఖాన్ మాత్రం ఎవరికీ తెలియకుండా కనీసం అమ్జద్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఖర్చులను భరించడం ఆయనలోని గొప్ప సంస్కారాన్ని చాటిచెబుతోంది.
సాయం అడిగే వరకు వేచి చూడకుండా అవసరాన్ని గుర్తించి ఆదుకోవడమే నిజమైన స్నేహం అని షాదాబ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా అమ్జద్ ఖాన్ ఆరోగ్య సమస్యల్లో అండగా నిలిచిన వ్యక్తే అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అపట్లో బాలీవుడ్ నటుల మధ్య బాండింగ్ ఎలా ఉండేది? అన్నది మరోసారి బయటప పడింది. నటుల మధ్య పోటీ మాత్రమే కాకుండా..కష్టం వస్తే? ఒకరికొకరు తోడుండే మానవత్వం కూడా పుష్కలంగా ఉండేదని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. అయితే అమ్జద్ ఖాన్ మరణించిన దశాబ్దాల తర్వాత కూడా ఈ విషయాలు ఎంతో ఓపెన్ గా పంచుకోవడం అన్నది షాదాబ్ ఖాన్ వ్యక్తిత్వానికి నిదర్శనం. చేసిన సహాయాన్నే మర్చిపోయే రోజుల్లో తన తండ్రి పాలిట నిలిచిన పఠాన్ ల వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.