30కి 700లు... ఈ లెక్కలు చూసి ఎన్నాళ్లయిందో..!

కరోనా తర్వాత బాలీవుడ్‌లో వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు సైతం పదుల కోట్ల ఓపెనింగ్‌ వసూళ్లను రాబట్టేందుకు కిందా మీదా పడుతున్నాయి.;

Update: 2025-08-01 08:30 GMT

కరోనా తర్వాత బాలీవుడ్‌లో వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు సైతం పదుల కోట్ల ఓపెనింగ్‌ వసూళ్లను రాబట్టేందుకు కిందా మీదా పడుతున్నాయి. స్టార్‌ హీరోల సినిమాల్లో చాలా వరకు వంద కోట్లు, అంతకు మించిన బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.25 కోట్లు వసూళ్లు, అంతకంటే తక్కువ వసూళ్లు సాధించినవి ఉన్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ఏడాదికి అర డజను లోపు సినిమాలు హిందీలో హిట్‌ అవుతూ వస్తున్నాయి. అందులో భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ఇంకా తక్కువ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌కి పూర్వ వైభవం తెచ్చే విధంగా సందడి చేస్తున్న సినిమా సయ్యారా. ఈ రొమాంటిక్ లవ్‌ స్టోరీ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న విషయం తెల్సిందే.

ఛావా రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సయ్యారా

'సయ్యారా' సినిమా విడుదలై వారాలు గడుస్తున్నా వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా మొదటి వారం తర్వాత థియేటర్‌లలో జనాలు ఉండని పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. అలాంటిది మూడో వారంలోనూ సయ్యార సినిమా థియేటర్‌లు హౌస్‌ ఫుల్‌ అవుతున్నాయి. ఇక ఓవర్సీస్‌ నుంచి ఈ సినిమా దాదాపుగా రూ.100 కోట్ల రెవిన్యూను రాబట్టడం ద్వారా రికార్డ్‌ను సృష్టించింది. తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లు సాధించడం ద్వారా చాలా రికార్డ్‌లను బ్రేక్ చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఛావా రికార్డ్‌ను బ్రేక్ చేసిన సయ్యార సినిమా కొత్త రికార్డ్‌ల వేట కొనసాగిస్తూనే ఉంది. రాబోయే వీకెండ్‌ లో మరింత స్ట్రాంగ్‌గానే సయ్యారా సినిమా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

వార్‌ 2 వచ్చే వరకు సయ్యారా జోరు

నాల్గవ వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటి వరకు ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, లాంగ్‌ రన్‌లో ఈ సినిమా రూ.1000 కోట్లు సాధించిన ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆగస్టు 14న వార్‌ 2 సినిమా రాబోతుంది. ఆ సినిమా వచ్చే వరకు మరే పెద్ద సినిమాలు లేవు. అంటే మరో రెండు వారాల పాటు సయ్యారా సినిమా జోరు కంటిన్యూ కావడం ఖాయం. అదే నిజం అయితే ఖచ్చితంగా సయ్యారా సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు మించి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సయ్యారా బాక్సాఫీస్ లెక్కలను అంచనా వేయడానికి విశ్లేషకులు సైతం కిందా మీదా పడుతున్నారు.

అహన్‌ పాండే, అనిత్‌ పడ్డా ఓవర్‌ నైట్‌ స్టార్‌డం

యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్‌ స్టోరీ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి రూ.700 కోట్ల మార్క్ను చేరే అవకాశాలు ఉన్నాయంటూ స్వయంగా యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఇలాంటి లెక్కలు బాలీవుడ్‌లో చూసి, విని చాలా ఏళ్లు అయిందని, ఇన్ని రెట్ల వసూళ్లు గత దశాబ్ద కాలంలో మరే సినిమాకు రాలేదు అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం సినిమాలో నటించిన హీరో హీరోయిన్‌ పాన్ ఇండియా స్టార్స్‌గా వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. తక్కువ సమయంలోనే వీరు పెద్ద స్టార్స్ అయ్యారు. హీరో అహాన్ పాండే, హీరోయిన్‌ అనిత్‌ పడ్డా లు ముందు ముందు మరిన్ని భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు మోహిత్‌ సూరి దర్శకత్వం వహించాడు. ఈయన కూడా వెంటనే మరో భారీ రొమాంటిక్ డ్రామా మూవీని చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News