మారుతోన్న స‌మీక‌ర‌ణాల‌పై హీరో ఆందోళ‌న‌!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ మూడు దశాబ్దాలుగా ఎన్నో విప్లవాత్మక మార్పులను చూసింది.

Update: 2026-06-07 22:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమ మూడు దశాబ్దాలుగా ఎన్నో విప్లవాత్మక మార్పులను చూసింది. నాటి తరం నటీనటులు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి పట్టిన సమయం, వారికి లభించిన అవకాశాలు వేరు. నేటి తరం నటీనటులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సవాళ్లు వేరు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవల సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులపై, ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచులు మరియు పరిశ్రమ తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీశాయి.

సైఫ్ అలీ ఖాన్ చిత్రసీమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ప్రేక్షకులు .. పరిశ్రమ ఎంతో క్షమించే గుణాన్ని కలిగి ఉండేవరని అభిప్రాయపడ్డారు. కెరీర్ ప్రారంభంలో తాను నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా? తదుపరి ప్రయాణంలో నిలదొక్కుకోవడానికి తగినన్ని అవకాశాలు .. సమయం దొరికాయని ఒప్పుకున్నారు. యష్ చోప్రా వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేసే అదృష్టం దక్కినప్పటికీ ఆ సినిమా ఆడలేదని, కానీ ఆ తర్వాత వచ్చిన `యే దిల్లీగి` చిత్రం తనను మళ్లీ నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు.

అయితే ప్రస్తుత కాలంలో పరిశ్రమ - ప్రేక్షకులు కూడా నటీనటుల విషయంలో కఠినంగా మారుతున్నారని సైఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నటీనటులు తమ తప్పుల నుండి నేర్చుకుంటూ ముందుకు సాగడానికి తగినంత సమయం లభించేదని కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు నటీనటులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని.. పొరపాట్లను .. వైఫల్యాలను అంత సులభంగా క్షమించడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ ప‌రిస్థితిని తన పిల్లలైన సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్లు కూడా ఎదుర్కొంటున్నారని సైఫ్ పేర్కొన్నారు.

నేటి తరం నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో హృతిక్ రోషన్ వంటి వారు తమ అరంగేట్రానికి ముందే డాన్స్, ఫిజిక్ పరంగా కఠినమైన శిక్షణ తీసుకున్న దాఖలాలు ఉన్నప్పటికీ నేటి రోజుల్లో ఆ సన్నద్ధత అనేది మరింత అనివార్యమైన అంశంగా మారిపోయిందన్నారు. యువ నటులు 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు పెద్ద తెరపై కనిపించాలనే బలమైన ఆకాంక్షతో ఉంటున్నార‌న్నారు. కానీ అంతిమంగా ప్రాజెక్ట్ నిర్ణయాలు అనేవి నిర్మాతల చేతుల్లో ఉంటాయని, అలాగే నేటి సినిమా ప్రపంచం పూర్తిగా మారిపోయిందని గుర్తుచేశారు. ఈ పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా విజయ వంతం కావాలంటే అదృష్టం, ఆశీస్సులు ఎంతో అవసరమ‌న్నారు. అయితే చిత్ర పరిశ్రమ ప్రస్తుత తరుణంలో మరింత తీవ్రమైన .. కఠినమైన స్థాయికి చేరుకుందని సైఫ్ విశ్లేషించారు.

సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను మాత్రమే కాకుండా మారుతున్న గ్లోబల్ సినిమా మార్కెట్ .. సోషల్ మీడియా యుగంలో నటులపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తున్నాయి. పాత కాలపు పరిస్థితుల నుండి నేటి పోటీ వాతావరణానికి పరిశ్రమ రూపాంతరం చెందిన తీరును ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News