'వ్యూస్, కామెంట్స్ కొనేస్తున్నాం.. ఏది జెన్యూన్?'
టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబ్ వ్యూస్ నుంచి సోషల్ మీడియా కామెంట్స్ వరకు ఆర్టిఫీషియల్ గా మారిపోయాయని ఆయన పరోక్షంగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఏది జెన్యూన్.. ఏది రియల్ కంటెంట్ అన్నది అర్థం కావట్లేదంటూ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన సమ్మర్ హాలీడేస్ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి పాల్గొన్న సాయి రాజేష్ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితుల పై ఓపెన్ గా మాట్లాడారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ అంటే కేవలం కంటెంట్ తో సరిపోవడం లేదని, సోషల్ మీడియా హైప్ కూడా కొనాల్సిన పరిస్థితి వచ్చిందని పరోక్షంగా అన్నారు.
రీసెంట్ గా తన చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి రిలీజైన వదలనే సాంగ్ గురించి మాట్లాడిన ఆయన.. "పాట రిలీజ్ చేసిన తర్వాత కూడా లోపల భయం ఉంటుంది. సినిమా ప్రేక్షకులకు చేరిందా? లేదా? ఓపెనింగ్స్ వస్తాయా? పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా? అనే టెన్షన్ ఉంటుంది" అని చెప్పారు. ఒకప్పుడు మంచి పాటలు, మంచి కథ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారని.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నిజమైన రెస్పాన్స్ ఏదో గుర్తించడం కష్టమైందని సాయి రాజేష్ అభిప్రాయపడ్డారు. "యూట్యూబ్ లో వ్యూస్ కొనేస్తున్నాం.. కామెంట్లు కొనేస్తున్నాం.. ట్విట్టర్ లో నెగిటివ్ ట్రెండ్ వస్తే పాజిటివ్ గా మార్చేస్తున్నాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. రియల్ సిచువేషన్స్ ను బయటపెట్టినట్లయ్యాయి. సోషల్ మీడియాలో కనిపించే హడావుడి మొత్తం నిజమైన ప్రేక్షకుల రెస్పాన్స్ కాకపోవచ్చని ఆయన కామెంట్స్ ద్వారా అర్థమైంది.
ఇటీవల చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ రావడం కష్టంగా మారిందని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా సరైన ప్రమోషన్ లేక వెనుకబడుతున్నాయని పలువురు దర్శకులు ఇప్పటికే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాయి రాజేష్ కామెంట్స్ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా బేస్డ్ ప్రమోషన్స్ పెరిగిన తర్వాత సినిమా విజయాన్ని అంచనా వేయడం కూడా కష్టమైందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అంతేకాదు.. ప్రేక్షకుల్లో కూడా సినిమా వాళ్లపై ఒక రకమైన విరక్తి పెరుగుతోందని సాయి రాజేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎక్కువ ప్రమోషన్, ఫేక్ హైప్ కారణంగా ప్రేక్షకులు అసలు కంటెంట్ పై నమ్మకం కోల్పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు నిజంగా ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ఏది? సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది ఏది? అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు సాయి రాజేష్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు నిజం మాట్లాడారని అభినందిస్తుండగా.. మరికొందరు ఇండస్ట్రీ మొత్తం ఇలాంటి పరిస్థితుల్లోనే నడుస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు టాలీవుడ్ లో సోషల్ మీడియా హైప్, ఫేక్ ప్రమోషన్లపై మరోసారి పెద్ద చర్చ మొదలయ్యేలా సాయి రాజేష్ వ్యాఖ్యలు చేశాయని చెప్పాలి.