సాయిప‌ల్ల‌వి-మృణాల్ ఠాకూర్ తీరు ఒకేలా!

టాలీవుడ్ లో వెలుగుతున్న ఇద్దరు అగ్రశ్రేణి నటీమణులు సాయిపల్లవి - మృణాల్ ఠాకూర్. ఒకరు సహజసిద్ధమైన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందగా.. మరొకరు అభినయంతో `సీతారామం` తర్వాత గోల్డెన్ గర్ల్ గా ఎదిగారు.

Update: 2026-07-02 15:30 GMT

టాలీవుడ్ లో వెలుగుతున్న ఇద్దరు అగ్రశ్రేణి నటీమణులు సాయిపల్లవి - మృణాల్ ఠాకూర్. ఒకరు సహజసిద్ధమైన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందగా.. మరొకరు అభినయంతో `సీతారామం` తర్వాత గోల్డెన్ గర్ల్ గా ఎదిగారు. ఇద్ద‌రి కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే ఓ ఆసక్తికర పోలిక కనిపిస్తుంది. భారీ కమర్షియల్ ప్రాజెక్టుల వెనుక పరుగులు తీయ కుండా.. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకోవడంలో ఒకే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తక్కువ సినిమాలతోనే గరిష్ట స్థాయి క్రేజ్ సంపాదించుకోవడం ఇద్ద‌రి భామ‌ల‌ ప్రత్యేకత.

సాయిపల్లవి కెరీర్ ప్రారంభం నుండి క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనే సూత్రాన్ని పాటిస్తోంది. కేవలం పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఒప్పుకోవడం, గ్లామర్ షోకు దూరంగా ఉంటూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోవడం ఆమెకే సాధ్యమైంది. సాయిపల్లవి బాటలోనే మృణాల్ ఠాకూర్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. హిందీ నుండి తెలుగులోకి అడుగుపెట్టిన మృణాల్ కమర్షియల్ హీరోయిన్‌గా కాకుండా అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. ఇద్ద‌రి ఎంపికలు చూస్తుంటే కథే సినిమాకు హీరో అనే నమ్మకం బలంగా క‌నిపిస్తోంది.

అయితే ఈ తరహా సెలెక్టివ్ జర్నీలో ఓ సవాలు కూడా ఉంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఆధారపడటం వల్ల ఒక దశలో మార్కెట్ విజిబిలిటీ తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాయిపల్లవి తన నటనతో ఈ రిస్క్‌ను అధిగమించగలిగింది. తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా అదే తరహా నిలకడను ప్రదర్శించాల్సి ఉంది. ఎందుకంటే టాలీవుడ్ వంటి పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ చాలా వేగంగా మారుతుంటుంది. నిరంతరం ప్రేక్షకులకు కనిపిస్తూ ఉండటం అనేది కమర్షియల్ అవసరం.

వీరిద్దరిలో ఉన్న మరో ఆసక్తికరమైన పోలిక.. ఇద్ద‌రు కూడా నటన కు పీక్ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వడం. మృణాల్ ఠాకూర్ `హాయ్ నాన్న` లో చూపిన హుందాతనం, సాయిపల్లవి ప్రతి చిత్రంలో చూపించే లీనత.. ఈ రెండూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బలమైన అంశాలుగా మారాయి. సోషల్ మీడియాలో కూడా ఇద్ద‌రు గ్లామర్ కంటే చేస్తున్న పాత్రల వెనుక ఉన్న లోతును చర్చించడానికే ఇష్టపడతారు. ఈ పరిణతి వారిని సాధారణ హీరోయిన్ల కంటే భిన్నంగా నిలబెడుతోంది.

ఒకవేళ ఇద్ద‌రు భ‌విష్యత్తులో కూడా ఇదే సెలెక్టివిటీ ని కొనసాగిస్తే అది వారిని ఒక కల్ట్ ఇమేజ్ వైపు నడిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాల్లో కూడా బలమైన పాత్రలు చేయడం వల్ల వారి స్థానం మరింత పదిలం అవుతుంది. అయితే ఎంపికల స‌మ‌యంలో కథల వైవిధ్యం విషయంలో ఇద్ద‌రు మరింత జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఎమోషనల్ పాత్రలకే పరిమితం కాకుండా వివిధ రకాల జోనర్లలో తమను తాము నిరూపించుకుంటే ఇద్ద‌రు దశాబ్దాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే నటీమణులుగా ఉంటారు.

సాయిపల్లవి -మృణాల్ ఠాకూర్ ఎంచుకున్న ఈ మార్గం ఇండస్ట్రీకి ఓ కొత్త ఊపిరిని పోస్తోంది. అందం మాత్రమే కాకుండా అభినయం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుందని నిరూపించారు. ఇతర నటీమణులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని గ్లామర్ పాత్రల కోసం కాకుండా నైపుణ్యానికి పదును పెట్టే పాత్రల కోసం వేచి చూస్తే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News