టాప్ బ్యానర్ లో ప్రముఖ సింగర్ బయోపిక్.. లీడ్ రోల్ లో ఎవరంటే?
క్లాసిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి.;
క్లాసిక్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. ఆ సినిమాతో భానుమతిగా అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి తన యాక్టింగ్ తో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సాయి పల్లవి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.
సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించే సాయి పల్లవి
ఆమె ఎంచుకునే సినిమాలే సాయి పల్లవికి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని అందించాయి. ఎక్స్‌పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి ఎంతో సహజంగా ఉంటూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూనే, అంతకుమించిన డ్యాన్సులతో యూత్ ను అలరిస్తుంటారు. అందుకే ఆమెతో సినిమా చేయడానికి ఎవరైనా ఎదురుచూస్తారు. కానీ ఆమె మాత్రం వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకోకుండా తన మనసుకు నచ్చే కథలను మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు.
నటిగా సాయి పల్లవి ఎప్పుడూ సక్సెస్సే..
అందుకే సాయి పల్లవి నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో కానీ నటిగా ఆమె మాత్రం ఎప్పుడూ ఫెయిలవలేదు. అయితే ఇప్పుడు సాయి పల్లవి ని ఓ బయోపిక్ కోసం మేకర్స్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రముఖ గాయని, లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ను సాయి పల్లవితో చేయాలని భావించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆమెను సంప్రదించారని తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్
ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఈ సినిమాకు మళ్లీ రావా, జెర్సీ, కింగ్‌డమ్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని. ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ మూవీలో సీతా దేవి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.