ధనుష్ సార్ పరిశ్రమలో ఉండటం మా అందరి అదృష్టం: సాయి దుర్గ తేజ్
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన `కర` (KARA) చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.;
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన `కర` (KARA) చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగా హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ధనుష్‌పై తనకున్న అమితమైన గౌరవాన్ని చాటుకున్నారు. ధనుష్‌ను భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడిగా అభివర్ణిస్తూ.. ``మేము మీకు పెద్ద అభిమానులం సార్..మమ్మల్ని ఇన్నేళ్లుగా అలరిస్తున్నందుకు ధన్యవాదాలు`` అని తన అభిమానం చాటుకున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన నటుడిని కలిగి ఉండటం మన పరిశ్రమ అదృష్టమని సాయిధరమ్ కొనియాడారు.
దర్శకుడు విఘ్నేష్ రాజా ప్రతిభను సాయి తేజ్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా `కర` టీజర్‌లో ధనుష్ ఇంట్రడక్షన్ సీన్ తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. కథానాయకుడి పాత్ర పరిచయంలో ధనుష్ వణుకుతున్నట్లుగా ఇచ్చే ఆ చిన్న ఎక్స్‌ప్రెషన్‌ను వెండితెరపై ఆవిష్కరించిన విధానం దర్శకుడి పనితనానికి నిదర్శనమని చెప్పారు. ఆ ఒక్క సీన్ చూశాక దర్శకుడు విఘ్నేష్‌పై తనకు నమ్మకం పెరిగిందని.. ఆయనను తెలుగు పరిశ్రమకు ఘనస్వాగతం పలుకుతున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ అందించిన బాణీలు, ధనుష్ డాన్స్ గురించి కూడా సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వచ్చిన `సార్` (వాతి) సినిమాలోని `మాస్టారు మాస్టారు` సాంగ్ తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నారు. ఆ పాటలో ధనుష్ చేసిన డాన్స్ నుండి కళ్లు తిప్పుకోలేమని.. ఆయన గ్రేస్ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందని ప్రశంసించారు. ఈ సినిమాలో కూడా జీవీ ప్రకాష్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ధనుష్ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన `రఘువరన్ బీటెక్`' సినిమా తనపై చూపిన ప్రభావాన్ని సాయి తేజ్ ఎమోషనల్‌గా వివరించారు. అందులో ధనుష్ తన తండ్రిని కౌగిలించుకునే ఒక భావోద్వేగ సన్నివేశం తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా పాత్రలోని చిన్న చిన్న సున్నితమైన హావభావాలను ఎలా పండించాలో ఆ సీన్ చూసి నేర్చుకున్నానని.. అది తన జీవితాన్ని సరిదిద్దిందని పేర్కొన్నారు. ధనుష్ నటనలోని ఆ గాఢత తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని వెల్లడించారు.
చిత్ర నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ చేస్తున్న సామాజిక సేవలను సాయి తేజ్ కొనియాడారు. కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా.. విద్యారంగంలో ఆయన అందిస్తున్న ఉచిత సేవలు గర్వించదగ్గవని.. అటువంటి వ్యక్తి పక్కన ఈరోజు ఈ వేదిక వద్ద కూర్చోవడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న `కర` సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని.. చిత్ర యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కర చిత్రం ఏప్రిల్ 30న తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అత్యంత భారీగా విడుదలవుతోంది.
తెలుగు వెర్షన్‌ను విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్‌తో కలిసి పంపిణీ చేస్తోంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, జయరామ్, కె.ఎస్. రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.