మరీ రెండేళ్ల గ్యాప్‌ ఇచ్చావ్‌ ఏంటి బ్రో..!

2020 వరకు ఈయన వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూనే వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో ఈ మెగా హీరో సినిమాలు చూద్దామన్నా కనిపించడం లేదు. 2023లో చివరగా బ్రో సినిమాతో ఈ మెగా హీరో వచ్చాడు.;

Update: 2025-07-17 10:30 GMT

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి దుర్గ తేజ్‌ కెరీర్‌ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేశాడు. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన సాయి తేజ్‌ ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున చేస్తూ వచ్చాడు. 2015లో రేయ్‌, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, 2016లో సుప్రీం, తిక్క, 2017లో విన్నర్‌, నక్షత్రం, జవాన్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. 2020 వరకు ఈయన వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూనే వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో ఈ మెగా హీరో సినిమాలు చూద్దామన్నా కనిపించడం లేదు. 2023లో చివరగా బ్రో సినిమాతో ఈ మెగా హీరో వచ్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన బ్రో సినిమాలో సాయి దుర్గ తేజ్‌ ముఖ్య పాత్రలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ సినిమా తర్వాత సాయి తేజ్ వెంటనే సినిమాను కమిట్‌ కాలేదు. విరూపాక్ష సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సాయి తేజ్‌ ఆ రేంజ్‌ సినిమా కోసం చాలా వెయిట్‌ చేశాడు. ఎట్టకేలకు సంబరాల యేటి గట్టు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా షురూ అయ్యి చాలా కాలం అయింది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే సినిమా విడుదల చేయాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు. మొన్నటి వరకు సినిమాను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు మేకర్స్‌ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ఏడాదిలోనే సినిమా విడుదల సాధ్యం అయ్యేలా లేదు.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంబరాల యేటి గట్టు సినిమా విడుదల తేదీని మార్చబోతున్నారు. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నా కూడా విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సోలో రిలీజ్ కోసం కాస్త ఎక్కువ సమయం వేచి చూడాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాయి దుర్గ తేజ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు ఆయన నుంచి సినిమాలు మాత్రం రాలేదు. సాయి దుర్గ తేజ్ సినిమా వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమాను విడుదల చేయక పోవడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు, రెగ్యులర్‌ ప్రేక్షకులు, మీడియా సర్కిల్స్ వారు ఈ మెగా హీరోపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీడియం రేంజ్‌ హీరోలు ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాలు చేయకుండా పెద్ద హీరోల మాదిరిగా రెండు మూడు ఏళ్లకు ఒకటి చొప్పున చేస్తూ వెళ్తే ఇండస్ట్రీ పరిస్థితి ఏమై పోవాలి అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబరాల యేటి గట్టు సినిమా విడుదల విషయమై క్లారిటీ ఇవ్వని సాయి దుర్గ తేజ్‌ తదుపరి రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. వచ్చే ఏడాదిలోనే సంబరాల యేటి గట్టు సినిమాతో పాటు ఈ రెండు సినిమాలు వస్తాయేమో చూడాలి. ఈ మూడు ఏళ్ల గ్యాప్‌ను ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రావడం వల్ల ఫిల్‌ చేయాలని సాయి దుర్గ తేజ్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News